Hyderabad: ఆకాశమే హద్దుగా కలలుగంటున్న హైదరాబాద్ యువకుడు
Hyderabad: ఇంటర్, బీటెక్ కుర్రాళ్లంటే పుస్తకాలతో కుస్తీ పడతారు. ఏమాత్రం ఖాళీ దొరికినా సినిమాలు, ఔటింగ్‌లు, చాటింగ్‌లతో కాలం గడిపేస్తారు.
Hyderabad: ఇంటర్, బీటెక్ కుర్రాళ్లంటే పుస్తకాలతో కుస్తీ పడతారు. ఏమాత్రం ఖాళీ దొరికినా సినిమాలు, ఔటింగ్‌లు, చాటింగ్‌లతో కాలం గడిపేస్తారు. కానీ హైదరాబాద్ కు చెందిన ఓ ఇంజినీరింగ్ విద్యార్థి ఆకాశమే హద్దుగా కలలుగన్నాడు. రాత్రి, పగలు కష్టపడి ఉపగ్రహాలపై పరిశోధన చేస్తున్నాడు. తన కలలను నిజం చేసుకుంటున్నాడు. ఇస్రో సహయంతో పీఎస్ఎల్వీ-సీ 51 రాకెట్ ద్వారా ఒక శాటిలైట్ ను నింగిలోకి పంపాడు. 18 ఏళ్ల వయస్సులో శాటిలైట్ ప్రోగ్రామర్ గా రాణిస్తున్న కీర్తన్ చంద్ పై హెచ్ ఎం టీవీ స్పెషల్ స్టోరీ.
హైదరాబాద్ కు చెందిన ఈ యంగ్ సైంటిస్ట్ పేరు కీర్తన్ చంద్. చిన్నప్పటి నుంచి సైన్ ప్రయోగాలు అంటే ఎంతో ఇష్టం. పదో తరగతి చదువుతున్నప్పుడు స్పేస్ కిడ్స్ ఆర్గనైజేషన్ నిర్వహించిన ఇండియా యంగ్ సైటింస్ట్ కాంపిటేషన్ లో సెలెక్ట్ అయ్యాడు. ఉపగ్రహాలపై పరిశోధన మొదలుపెట్టాడు.
గత ఫిబ్రవరిలో బ్రెజిల్‌కు చెందిన అమెజోనియ-1 ఉపగ్రహం తో పాటు మరో 18 శాటిలైట్లను పీఎస్ఎల్వీ-సీ 51 రాకెట్ నింగిలోకి తీసుకెళ్లింది. ఈ ప్రయోగాన్ని నెల్లూరు జిల్లా శ్రీహరి కోట లోని షార్ నుంచి చేశారు. 18 శాటిలైట్ ల్లో సతీష్ ధావన్ పేరిట తయారు చేసిన ఒక శాటిలైట్ ను కీర్తన్ టీమ్ రూపొందించింది. మొత్తం స్వదేశీ పరికరాలతో కేవలం నాలుగు నెలల్లో శాటిలైట్ ను కీర్తన్ జట్టు తయారుచేయడం విశేషం.
శాటిలైట్ ప్రయోగాలు చేస్తున్న కీర్తన్ వయస్సు ఇప్పుడు కేవలం 18 సంవత్సరాలే. ఇతడి టీమ్ లోని ఏడుగురే 22 ఏళ్ల లోపువారే. కుర్రాళ్లు శాటిలైట్ తయారు చేస్తామంటే ఎవరూ నమ్మలేదు. ఇస్రో, ప్రభుత్వ ప్రోత్సాహంతో శాటిలైట్ ను రూపొందించామని కీర్తన్ చెబుతున్నారు.
కీర్తన్ చిన్నప్పటి నుంచి ఏ వస్తువైనా దొరికితే దాన్ని మరో దానికి జోడించి కొత్త ఆవిష్కరణ చేసేవాడు. తరచూ సైన్స్ ఫేర్ లలో పాల్గొనేవాడు. ప్యాకెట్ మనీని కూడా ప్రయోగాలకు ఖర్చు పెట్టేవాడు. సైన్స్ పట్ల కీర్తన్ ఇంట్రెస్ట్ గుర్తించి ఎంకరేజ్ చేశామని తల్లిదండ్రులు చెబుతున్నారు, స్పేస్ కిడ్స్ ఆర్గనైజేషన్ నిర్వహించిన కార్యక్రమంలో సెలెక్ట్ కావడం కీర్తన్ జీవితానికి మలుపు తిప్పింది అని అంటున్నారు.
ప్రస్తుతం కీర్తన్ చెన్నైలోని భారత్ ఇంజినీరింగ్ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. శాటిలైట్ ఇండస్ట్రీలో పరిశోధనలు చేయడం, కొత్త కొత్త శాటిలైట్ లు ఆవిష‌్కరణలు చేయడం తన లక్ష్యమంటున్నాడు ఈ యంగ్ సైంటిస్ట్. శాటిలైట్ రంగంలో కీర్తన్ గొప్ప సైంటిస్ట్ గా పేరు తెచ్చుకోని, ప్రపంచపటంలో భారతదేశ కీర్తిని చాటాలని ఆకాంక్షిస్తూ హెచ్ ఎం టీవీ ఆల్ ది బెస్ట్ చెబుతోంది.