Huzurabad: ఉప ఎన్నిక షెడ్యూల్ ఆలస్యమయ్యే ఛాన్స్.. నోటిఫికేషన్ వచ్చేలోపు అంతా సెట్‌రైట్..
Huzurabad: హుజూరాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ ఇంకా ఆలస్యమయ్యేలా కనిపిస్తుంది.
Huzurabad: హుజూరాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ ఇంకా ఆలస్యమయ్యేలా కనిపిస్తుంది. ఆగస్ట్‌లో షెడ్యూల్ వస్తుందని భావించినప్పటికీ ఆ పరిస్థితి కనిపించడం లేదు. కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో ఎన్నికల నిర్వాహణపై తమ అభిప్రాయం ఈనెల 30లోపు తెలపాలని కేంద్ర ఎన్నికల కమిషన్ దేశంలోని అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు లేఖలు రాసింది. అంటే ఈనెల 30వరకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం లేదు. దాదాపు సెప్టెంబర్ 15లోపు హుజూరాబాద్ ఉప ఎన్నిక ఉండే అవకాశం లేదని తేలిపోయింది.
సెప్టెంబర్ చివరి వారంలో లేదా అక్టోబర్ మొదటి వారంలో హుజూరాబాద్ కు ఉప ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందంటున్నారు ఎన్నికల అధికారులు. అయితే ఆలస్యమయ్యే కొద్దీ హుజూరాబాద్ ఉపఎన్నిక బీజేపీకి ఇబ్బందికరంగా మారగా టీఆర్ఎస్‌కు కలిసి వస్తుందంటున్నారు విశ్లేషకులు. ఈ ఉప ఎన్నిక ఆలస్యమయ్యే కొద్దీ హుజూరాబాద్ లో పరిస్థితులను టీఆర్ఎస్ తనకు అనుకూలంగా మలుచుకుంటుంది. స్థానిక పరిస్థితులు చక్కదిద్దుకునేందు ప్లాన్ చేసుకుంటున్నారు.
అయితే హుజురాబాద్‌లో అభివృద్ధి పనులను పరుగులు పెట్టించడానికి ప్లాన్ చేశారు. గ్రామాల్లో కొత్త సీసీ రోడ్లు వేయడంతో పాటు, కొత్త పెన్షన్ లు, కొత్త రేషన్ కార్డులు, యాదవులకు గొర్రెల పంపిణీ, దళితులకు దళితబంధు ఇలా అన్ని సామాజిక వర్గాలకు ఏదో ఒక రూపంలో దగ్గర చేసుకునేందుకు టీఆర్ఎస్‌కు కావాల్సిన సమయం ఉప ఎన్నిక ఆలస్యం కావడం ద్వారా దొరికింది. టీఆర్ఎస్ అధిష్టానం గెలుపుపై ధీమాగా ఉంది. మరోవైపు దళితబంధుని హుజూరాబాద్ లో లాంఛనంగా ప్రారంభించిన సీఎం కేసీఆర్ మరో 20 రోజులలో మళ్ళీ హుజూరాబాద్ లో పర్యటిస్తానని చెప్పారు. దీంతో హుజురాబాద్‌లో పార్టీకి ఇంకా ఏమైనా ప్రతికూల పరిస్థితులు ఉంటే వాటిని సరిచేసి అంతా సెట్ రైట్ చేసేందుకు సిద్దమవుతున్నారట గులాబీ బాస్.