Huzurabad By-Election Result: నేడు హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం
* ఉదయం 8 గంటలకు కరీంనగర్ ఎస్‌ఆర్‌ఆర్ కాలేజీలో ఓట్ల లెక్కింపు * ఎస్‌ఆర్‌ఆర్ కాలేజీ దగ్గర 144 సెక్షన్ విధింపు
Huzurabad By-Election Result: కొన్ని గంటల్లో హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం వెలువడనుంది. ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కరీంనగర్‌లోని ఎస్‌ఆర్‌ఆర్ కాలేజీలో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభంకానుంది.
రెండు కౌంటింగ్ హాళ్లను ఏర్పాటు చేసిన అధికారులు ఒక్కో హాల్లో 14 చొప్పున టేబుళ్లు సిద్ధం చేశారు. మొత్తం 22 రౌండ్లలో ఓట్ల లెక్కింపును పూర్తిచేయనున్నారు. ఒక్కో రౌండ్‌కు గంట సమయం పట్టవచ్చని సమాచారం. ఇక ఇప్పటికే లెక్కింపు సిబ్బంది, అభ్యర్థుల ఏజెంట్లు కౌంటింగ్ సెంటర్‌కు చేరుకున్నారు.
ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత ఈవీఎంలోని ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. అలాగే లాటరీ ద్వారా ఎంపికచేసిన ఐదు వీవీ ప్యాట్లలోని ఓట్ల స్లిప్పులను పరిశీలిస్తారు. ఒక్కో అభ్యర్థి తరపున టేబుల్‌కు ఒక్క ఏజెంట్‌ను మాత్రమే అనుమతిస్తున్నారు.
ఎస్‌ఆర్‌ఆర్ కాలేజ్ దగ్గర 144 సెక్షన్ విధించారు. గెలిచిన వారితో ఇద్దరికి మాత్రమే రిటర్నింగ్ ఆఫీసర్ వద్దకి అనుమతి ఉంది. విజయోత్సవ ర్యాలీలకు ఎలాంటి అనుమతి లేదని కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే స్పష్టం చేసింది. మొత్తానికి తెలంగాణ ప్రజలు హుజూరాబాద్ వైపే చూస్తున్నారు. అక్కడేం జరుగుతోందా అని యావత్ రాజకీయం చూస్తోంది. హుజూరాబాద్ బాహుబలి ఎవరా అని నేతగణం చూస్తోంది.