Special Report On Nagarjuna Sagar Dam : కృష్టానది ఉరకలెత్తుతోంది. ఎగువన వర్షాలు పడుతుండడంతో వరద ప్రవాహం మొదలైంది. ఒక్కో డ్యాం నిండుకుంటూ శ్రీశైలం జలాశయానికి కృష్ణా జలాలు చేరుకున్నాయి. తర్వాత ఇప్పుడు నాగార్జునసాగర్ జలశయానికి కృష్ణమ్మ తరలిరానుంది. ఇటు రావమ్మా కృష్ణమ్మ అంటూ నాగార్జునసాగర్ జలాశయం కూడా స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉంది. దీంతో ఖరీఫ్ సాగుకు డోకా లేదని ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నాగార్జునసాగర్ తాజా పరిస్థితిపై హెచ్ఎంటీవీ స్పెషల్ రిపోర్ట్.
నాగార్జునసాగర్ రెండు తెలుగు రాష్ట్రాలకు అన్నపూర్ణలాంటింది. దాదాపు ఇరవై మూడు లక్షల ఎకరాలకు సాగు, తాగు నీరు అందిస్తోంది. అయితే ప్రతి ఏటా నాగార్జునసాగర్ కు జూలై చివరి వారంలో లేదంటే ఆగస్టులో ప్రవాహం మొదలవుతుంది. ఎగువన వర్షాలు కురుస్తుండడంతో ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల, తుంగభద్ర మీదుగా కృష్ణమ్మ శ్రీశైలం జలాశయానికి తరలింది. ఇక అటు నుంచి నాగార్జునసాగర్ కు రావడమే తరువాయి.
ప్రస్తుతం నాగార్జునసాగర్ లో 530 అడుగుల నీరు ఉంది. ఎగువ నుంచి కృష్ణమ్మ తరలివస్తే నాగార్జనసాగర్ నిండుకుండలా మారుతుంది. అయితే కృష్ణ జలాలను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేయాలని రైతులు కృష్ణా నది యాజమాన్య బోర్డు దృష్టికి తీసుకెళ్లారు. జూలై రెండో వారంలోనే భారీ ఇన్ ఫ్లో కొనసాగడం శుభపరిణామమని రైతులు అంటున్నారు. గత ఖరీఫ్, రబీ, ఇప్పుడు ఖరీఫ్ వరుసగా మూడు కాలలపాటు సమృద్ధిగా నీరు అందడం ఇదే తొలిసారి అని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇక గతానికి భిన్నంగా జూలైలో కూడా ఖరీఫ్, రబీ పంటలు ముగిశాక నాగార్జునసాగర్ లో 590 అడుగులకు గాను 530 అడుగులు ఉండటం కొసమెరుపు.. అయితే రెండు ప్రభుత్వాలు కూడా రైతన్నలకు ఉపయోగకరంగా నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. కుడి ఎడమ కాల్వలకు వారం పది రోజుల్లో నీటి విడుదల చేయాలని రైతులు విజ్నప్తి చేస్తున్నారు.