Eetala Lands: ఈటల భూముల్లో సర్వే చేయొచ్చు...హైకోర్టు
Eetala Lands: ఈటల రాజేందర్ కుటుంబానికి చెందిన భూముల సర్వే చేయొచ్చని హైకోర్టు తెలిపింది.
Eetala Lands: కేసీఆర్ వర్సెస్ ఈటల ఎపిసోడ్ ఇంకా కొనసాగుతోంది. భూఆక్రమణలకు పాల్పడ్డారంటూ ఆరోపణలే కాకుండా.. అధికారుల విచారణలో నిర్ధారణ అయినట్లు ప్రకటించిన ప్రభుత్వం... దానికి కొనసాగింపుగా సర్వే కూడా చేయిస్తోంది. తప్పు చేయలేదని స్పష్టంగా చెప్పకుండా.. అందులో తప్పేంటి అంటూ ఈటల సైతం విచిత్ర వాదన చేస్తున్నారు. అందుకే సర్వేను అడ్డుకోవడానికి హైకోర్టుకు వెళ్లారు ఈటల భార్య.. కాని నిరాశే ఎదురైంది.
మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ కుటుంబానికి చెందిన భూముల సర్వే నిలిపివేతకు హైకోర్టు నిరాకరించింది. సర్వే వాయిదాకు అనుమతించింది. జూన్ రెండు లేదా మూడో వారంలో నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలని ఎమ్మార్వోను ఆదేశించింది. సర్వే నిర్వహించాలంటూ తూప్రాన్ డివిజన్ డిప్యూటీ ఇన్ స్పెక్టర్ ఆఫ్ సర్వే ఈ నెల 6న ఇచ్చిన నోటీసులను సవాలు చేస్తూ ఈటల భార్య జమున హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గురువారం జస్టిస్ బి. విజయ్సేన్ రెడ్డి విచారణ చేపట్టారు.
చట్టప్రకారం నోటీలసులిచ్చి చర్యలు తీసుకోవాలని గతంలో సింగిల్ జడ్జి ఆదేశాలిచ్చారని, ఇప్పుడు నోటీసులిచ్చి సర్వే చేస్తుంటే ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది డి. ప్రకాశ్ రెడ్డి వాదనలు వినిపిస్తూ నోటీసులు చట్టప్రకారం ఇవ్వలేదన్నారు. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు అసైన్డ్ భూముల స్వాధీనానికి సంబంధించి అని, ఈ వ్యవహారంపై అసైన్డ్ భూముల నిరోధర చట్టం(పీఓటీ) కింద ఇప్పటికే నోటీసులుజారీ చేశారన్నారు. ఇవి అమల్లో ఉండగా సర్వేకు తిరిగి నోటీసులిచ్చారని, ఒకేసారి రెండు రకాల ప్రొసీడింగ్స్ ఎలా అమలు చేస్తారన్నారు. కాగా, కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో కొన్నిరోజుల పాటు భూ సర్వే వాయిదా వేసేందుకు తాము సంసిద్ధంగా ఉన్నామని ఏజీ తెలిపారు. వాదనల అనంతరం స్టే నిరాకరించిన న్యాయస్థానం... జూన్ రెండవ, లేదా, మూడవ వారంలో సర్వే చేయాలని మాసాయిపేట మండల రెవెన్యూ అధికారులను ఆదేశించింది.
మరోవైపు, మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజకీయ భవితవ్యం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. భూకబ్జా ఆరోపణల తర్వాత మంత్రివర్గం నుంచి ఈటలను కేసీఆర్ సర్కారు తొలగించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నుంచి టీఆర్ఎస్ నేతలు, ఈటల రాజేందర్ మధ్య తీవ్ర మాటల యుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీ, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇది ఇలావుంటే, బీజేపీ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని.. ఈటల రాజేందర్ త్వరలోనే కాషాయ కండువా కప్పుకుంటారని ప్రచారం జరుగుతోంది.