Heavy Rains: భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు.. పది జిల్లాలకు రెడ్ అలర్ట్
Heavy Rains: రాష్ట్రంలో శుక్రవార నాలుగు జిల్లాల్లో, శనివారం ఆరుజిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది.
Heavy Rains:రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరిక జారీ చేసింది. శుక్రవారం 4 జిల్లాల్లో, శనివారం 6 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. నేడు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ నెల 20వ తేదీన కుమురంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆయా ప్రాంతాల్లో ఏకంగా 20 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసే అవకాశం ఉందని అప్రమత్తం చేసింది. ఇవేకాకుండా మరో 6 జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆయా సమయాల్లో ఒకేసారి వరద ముంచుకురావడం, రోల్డు, లోలెవల్ వంతెనలు మునిగిపోవడం, కొట్టుకుపోవడం వంటి ప్రమాదాలు సంభవించే ఛాన్స్ ఉందని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణశాఖ తెలిపింది.
ఏపీలో భారీ వర్షం..కొట్టుకుపోయిన కారు:
ఏపీలో కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో లోతు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ వాగును దాటుతున్న ఓ కారు వరదలో కొట్టుకుపోయింది.అదృష్టవశాత్తూ వాగులోని చెట్ల పొదల్లో కారు చిక్కుకుపోవడంతో అందులో ఉన్న ఐదుగురు ప్రాణాలతో బయటపడ్డారు.కారులో ఉన్నవారిని కాపాడేందుకు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.