Heavy Rains: భైంసా మునిగిపోతుంది

Heavy Rains: భైంసా మునిగిపోతోంది. అవును. భైంసా మునిగిపోతోంది.

Update: 2021-07-22 11:47 GMT

Heavey Rains: భైంసా మునిగిపోతుంది

Heavy Rains: భైంసా మునిగిపోతోంది. అవును. భైంసా మునిగిపోతోంది. మరో ప్రళయం ముంచెత్తడానికి జలపంజా విసురుతోంది. ఆకాశానికి చిల్లుపడినట్టుగా జలధార దూకుతోంది. రోడ్లు, వీధులు, ఇళ్లూ, ఆఫీసులను జలమయం చేస్తోంది. చెట్టుకొకరు పుట్టకొకరుగా జనం బందీ అయిపోయారు. ఎక్కడివారు అక్కడే అన్నట్టుగా బిక్కుబిక్కుమంటూ ఉండిపోయారు.

మొత్తం ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లానే కాదు యావత్‌ తెలుగు రాష్ట్రాలు స్తంభించిపోయాయి. మరీ ముఖ్యంగా తెలంగాణను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాలతో భైంసా పూర్తిగా నీట మునగగా, పలు ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఈదురుగాలులు, కుంభవృష్టి కారణంగా జనజీవనం అస్తవ్యస్థమైంది. మరో రెండు మూడు రోజులు కుండపోత అవకాశాలు ఉన్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో తెలంగాణ ప్రభుత్వం అలర్టయింది.

కుండపోత వర్షాలు తెలంగాణను ముంచెత్తున్నాయి. రోడ్లన్నీ చెరువులుగా మారాయి. వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అనేక ప్రాంతాల్లో నీళ్లు నడుము లోతు వరకు ప్రవహించగా, ఇళ్లు జలమయమయ్యాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. పదుల సంఖ్యలో చెట్లు కూలిపోయాయి. వేల సంఖ్యలో వాహనాలు నీటిలో చిక్కుకుని రోడ్లపై నిలిచిపోయాయి.

గత రెండు రోజులు నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు భైంసా అతలాకుతలం అవుతోంది. అక్కడి గడ్డెన వాగు ఐదు గేట్లు తెరవడంతో భైంసా నీట మునిగింది. మరో రెండు మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకూడదని అధికారులు హెచ్చరించారు. 

Tags:    

Similar News