Rain Alert - Telangana: నేడు, రేపు భారీ వర్ష సూచన
Rain Alert - Telangana: * గ్రేటర్ హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం * మరో రెండ్రోజులు వర్షాలకు చాన్స్
Rain Alert - Telangana: గులాబ్ తుపాను.. రాష్ట్రాన్ని వణికించింది. సోమవారం తెల్లవారుజాము నుంచి కురుస్తున్న కుండపోత వర్షాలతో ముంచెత్తింది. అధిక వర్షాలతో పలు ప్రాంతాల్లో కాలనీలు, రోడ్లు నీటమునిగి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. చెరువులు నిండిపోయాయి. అత్యధికంగా రాజన్న సిరిసిల్ల జిల్లా మర్రిగడ్డలో 18.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షాల నేపథ్యంలో ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ టెలికాన్ఫరెన్స్‌లో అధికారులతో సమీక్షించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఇవాళ విద్యాసంస్థలు, ప్రైవేట్, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ప్రకటించారు. అప్రమత్తమైన అధికార యంత్రాంగం కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసి సహాయక చర్యలను ముమ్మరం చేసింది.
ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. ఉమ్మడి మెదక్, వరంగల్‌లో వాన దంచికొట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు పలు చోట్ల పంటలకు తీవ్ర నష్టం ఏర్పడింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 21 మండలాల్లో 3వేల 172 ఎకరాల్లో వరి, పత్తి పంటలు నీట మునిగాయి. అటు నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జనగామ, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సిద్ధిపేట జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ 14 జిల్లాల్లో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. అత్యవసరమైతేనే బయటకు రావాలని పోలీస్ శాఖ సూచించింది.
గులాబ్ తుఫాన్ ప్రభావంతో గ్రేటర్ హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురిసింది. ఆదివారం రాత్రి మొదలైన వర్షం సోమవారం రోజంతా కొనసాగింది. సాయంత్రానికి మరింత బీభత్సం సృష్టించింది. నగరంలో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. చాలా చోట్ల రహదారులపై నీరు పోటెత్తింది. కాలనీలు జలమయమయ్యాయి. పలు చోట్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్‌లో నాలాలు, కాలువలు ఉప్పొంగాయి. రహదారులు ఏరులయ్యాయి. అనేక ఇళ్లలోకి నీరు చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అవస్థలు పడ్డారు. కొన్ని ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి.
ఇవాళ, రేపు కూడా భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం హెచ్చరించడంతో అన్ని ప్రభుత్వ శాఖలు అప్రమత్తమయ్యాయి. GHMCలో అన్ని స్థాయిల అధికారులు, సిబ్బందికి సెలవులను రద్దు చేస్తున్నట్లు కమిషనర్ లోకేష్ కుమార్ ప్రకటించారు. అవసరమైతేనే లోతట్టు ప్రాంతాల వారిని, పురాతన కట్టడాలకు సమీపంలో ఉన్నవారిని తరలించేందుకు 30 పునరావస కేంద్రాలు, 170 మాన్సూన్ టీమ్‌లు, 92 స్టాటిస్టిక్స్ బృందాలను సిద్ధం చేశారు. కూలిపోయే స్థితిలో ఉన్న ఇళ్లను గుర్తించి వారిని అప్రమత్తం చేస్తున్నారు.