Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో హైకోర్టులో విచారణ
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వ అనుమతి.. అవసరం లేదని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కౌంటర్ దాఖలు
Phone Tapping Case: ఫోన్ టాపింగ్ కేసులో హైకోర్టులో విచారణ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కౌంటర్ దాఖలు చేశాయి. ఐతే ఫోన్ ట్యాపింగ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వ అనుమతి అవసరం లేదని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కౌంటర్లో పేర్కొంది. ఫోన్ టాపింగ్ అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదని సెంట్రల్ గవర్నమెంట్ స్పష్టం చేసింది. టాపింగ్ చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యేక అధికారం ఉంటుందని తేల్చి చెప్పింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన ఫోన్ టాపింగ్ వ్యవహారంపై తమకు ఎలాంటి సమాచారం లేదని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ హైకోర్టుకు నివేదించింది. రాజకీయ ప్రత్యర్థులు, ప్రైవేటు వ్యక్తులతో పాటు న్యాయమూర్తుల ఫోన్లను ట్యాప్ చేస్తున్నట్లు వచ్చిన కథనాల ఆధారంగా తీసుకున్న సుమోటో పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ టి.వినోద్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది.
కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ నరసింహశర్మ వాదనలు వినిపిస్తూ కౌంటరు దాఖలు చేశారు. ఏ పరిస్థితుల్లో ఫోన్ ట్యాపింగ్ చేయవచ్చో టెలిగ్రాఫిక్ నిబంధనల్లో స్పష్టంగా ఉందన్నారు. ట్యాపింగ్‌కు అనుమతిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల హోంశాఖ కార్యదర్శులు ఆదేశాలు జారీ చేయవచ్చు. రెండింటికీ వేర్వేరుగా రివ్యూ కమిటీలు ఉంటాయి. అయితే ట్యాపింగ్ ఎందుకు చేయాల్సి వచ్చిందన్న దానిపై కారణాలు నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. ఫోన్ టాపింగ్ చేయడానికి రివ్యూ కమిటీ ఆమోదిస్తే 60 రోజుల వరకు అనుమతి ఉంటుందని, గరిష్టంగా 180 రోజుల వరకు పొడిగించుకునే వెసులుబాటు ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కౌంటర్ దాఖలు చేయడంతో విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది హైకోర్టు.