పాడి కౌశిక్ రెడ్డి vs అరికెపూడి గాంధీ హైటెన్షన్.. ఇలా చేస్తావా రేవంత్ రెడ్డి?: హరీష్ రావు

Update: 2024-09-12 08:27 GMT

Harish Rao About Arikepudi Gandhi: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ వెళ్లిన నేపథ్యంలో అక్కడ రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. పాడి కౌశిక్ రెడ్డి ఇంట్లోకి అరికెపూడి గాంధీ వెళ్లేందుకు ప్రయత్నించగా ఆయన్ని పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు కౌశిక్ రెడ్డిని ఇంట్లోంచి బయటకు రాకుండా హౌజ్ అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే కొండాపూర్ లోని కౌశిక్ రెడ్డి ఇంటి బయట ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు.

పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై అరికెపూడి గాంధీ తమ అనుచరులు, మందిమార్బలంతో వెళ్లి దాడికి పాల్పడ్డారని హరీష్ రావు మండిపడ్డారు. కౌశిక్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడిని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని ప్రకటించిన హరీష్ రావు.. ఇదేం ప్రజాస్వామ్యం, ఇదేం ప్రజాపాలన అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకునే కాంగ్రెస్ నేతలు ఇలాగే దాడులకు పాల్పడుతారా అని ప్రభుత్వాన్ని నిలదీశారు.

బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవడంతో పాటు, వారినే తిరిగి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపైకి ఉసిగొల్పి దాడులు చేయించడం దుర్మార్గమైన చర్య అని హరీష్ రావు మండిపడ్డారు. ఈ ఘటనతో కాంగ్రెస్ పార్టీ విద్రోహ, వికృత, అప్రజాస్వామిక చర్యకు పాల్పడిందని.. ఆ వైఖరిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి ప్రోద్బలంతోనే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి

సీఎం రేవంత్ రెడ్డి ప్రోద్బలంతోనే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి జరిగిందని హరీష్ రావు ఆరోపించారు. ఈ దాడికి కారకులైన సీఎం రేవంత్ రెడ్డి వెంటనే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాళ్లు, గుడ్లు, టమాటాలతో మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మీద ఎమ్మెల్యే అరికపూడి గాంధీ అనుచరులు దాడి చేయడం హేయమైన చర్య అని అసహనం వ్యక్తంచేశారు.

అరికెపూడి గాంధీ చెప్పి మరీ దాడి చేశారు

ప్రభుత్వంలోని పెద్దలు వేసిన పక్కా ప్రణాళికతోనే కౌశిక్ రెడ్డి నివాసంపై దాడి జరిగిందన్నది సుస్పష్టం. పాడి కౌశిక్ రెడ్డి ఇంటి మీదకు వస్తామని అరికెపూడి గాంధీ ప్రెస్‌మీట్‌లో చెప్పి మరీ వచ్చి దాడి చేశారు. అయినప్పటికీ ఆ దాడిని నిలువరించడంలో ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ తీవ్రంగా విఫలమైంది. అందుకే పట్టపగలు ఒక ప్రజాప్రతినిధిపై జరిగిన ఈ దాడికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి అని హరీష్ రావు డిమాండ్ చేశారు. కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడికి వెళ్లిన అరికెపూడి గాంధీని, అతని అనుచరులను వెంటనే అరెస్టు చేయాలని హరీష్ రావు పోలీసులను డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి పూర్తి భద్రత కల్పించాలని స్పష్టంచేశారు. 

Tags:    

Similar News