TRS Plenary: మనస్తాపంతోనే కవిత ప్లీనరికి వెళ్లలేదా?
TRS Plenary: తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీకి నాయకులు కార్యకర్తలు భారీగా తరలివచ్చినా ఏదో తెలియని వెలితి పార్టీ నేతలను వెంటాడిందా?
TRS Plenary: తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీకి నాయకులు కార్యకర్తలు భారీగా తరలివచ్చినా ఏదో తెలియని వెలితి పార్టీ నేతలను వెంటాడిందా? ప్లీనరీలో కేవలం సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ తప్ప మిగతా కుటుబసభ్యులు పెద్దగా ఎందుకు కనిపించలేదు. కారణాలు ఎలా ఉన్నా కనీసం ఒక్కసారైనా వచ్చి వెళ్తే బాగుండేదన్నట్టుగా ఫీలైన క్యాడర్ ట్రబుల్ షూటర్ హరీష్‌రావు, ఎమ్మెల్సీ కవిత గైర్హాజరుపై ఆరా తీస్తోందా? హుజూరాబాద్ బిజీలో హరీష్‌రావు ఉంటే జ్వరం కారణంగా కవిత రాకపోవడంపై వస్తున్న అనుమానాలేంటి?
హైటెక్స్ వేదికగా తెలంగాణ రాష్ట్ర సమితి ద్వి దశాబ్ది ఉత్సవాలను ఘనంగా జరుపుకుంది. పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్‌ను తొమ్మిదోసారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పార్టీ స్థాపించిన నాటి నుంచి కేసీఆర్‌కు అడుగడుగునా అండగా ఉన్న హరీష్‌రావు అస్సలు కనిపించలేదు. ప్లీనరీలో అంతా కేసీఆర్, కేటీఆర్ షోగానే నడించింది. బయట మొత్తం ఫ్లెక్సీలు కేసీఆర్‌వి ఉంటే లోపల హడావుడంతా కేటీఆర్ అనుచరులదేనట. ప్లీనరీ సందర్భంగా హైదరాబాద్ అంతా గులాబీమయం అవగా, హరీష్‌రావు, కవిత కటౌట్లు ఎక్కడ కనిపించకపోవడంతో క్యాడర్‌లో కంగారు మొదలైందట. అధిష్టానం ఇచ్చిన సూచనలతో కేసీఆర్, కేటీఆర్‌లను ప్రమోట్ చేస్తూ భారీగా ప్రచారం చేశారని చెప్పుకుంటున్నారట.
పార్టీ ప్లీనరి ఎప్పుడు జరిగినా మాస్‌లీడర్‌గా హరీష్‌రావు అందరినీ ఆకట్టుకునే వారు గతంలో కూడా ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన పార్టీ ప్లీనరీలో హరీష్‌రావు వేదిక మీదకు రాగానే కార్యకర్తలంతా హరీష్ హరీష్ అంటూ గట్టిగా నినాదాలు చేశారు. ఆనాడు పార్టీ అధినేత కేసీఆర్ హరీష్ గాలి బాగానే వీస్తున్నట్టుందంటూ సభా వేదికగానే సెటైర్లు వేశారు. అప్పటి నుంచి హరీష్‌రావు ప్రాధాన్యతను తగ్గిస్తున్న వచ్చిన ఓ వర్గం కేటీఆర్‌ను ప్రమోట్ చేయడం మొదలు పెట్టిందన్నది ఓపెన్ సీక్రెట్‌గా చెబుతోంది క్యాడర్. అయితే, హరీష్‌రావు హుజూరాబాద్ ఎన్నిక బాధ్యతను తన భుజాన మోస్తుండటం, క్షణం తీరక లేకుండా అక్కడి నుంచే ఆపరేషన్స్ చేస్తుండటం వల్లే ఆయన ఆబ్సెంట్ అయ్యారని చెప్పుకుంటున్నా లోలోపల మాత్రం ఇంకేదో ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. సాక్షాత్తూ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సూచన మేరకే ఆయన ప్లీనరికి రాలేదని తెలుస్తోంది.
ఇక, కవిత విషయానికొస్తే ఆమెకు జ్వరం రావడం వల్లే ప్లీనరికి రాలేదని గులాబీ నేతలు చెబుతున్నారు. ఎమ్మెల్సీ హోదాలో పార్టీ ప్లీనరీకి ఆహ్వానం అందినా కాసేపైనా అలా వచ్చి ఇలా వెళ్తే బాగుండేదన్న మాటలు వినిపించాయి. దుబాయ్‌లో బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మ సంబరాలను నిర్వహించి తిరిగి వచ్చిన అలసట వల్లే ప్లీనరీకి హాజరు కాలేదన్న టాక్ వినిపిస్తోంది. కానీ, కొన్నాళ్ల నుంచి కవిత చాలా సైలెన్స్ మెయింటైన్ చేస్తోందట. పార్టీలో, ప్రభుత్వంలో కీలక పదవి లేకుండా ప్లీనరీకి వెళ్లి జనం మధ్యలో ఎలా కూర్చోవాలో తెలియకే రాలేదన్నది ఓ ప్రచారం.
ఇవన్నీ ఊహాగానాలేనని కొట్టి పారేస్తున్న గులాబీ దళం పార్టీ కార్యక్రమాల్లో కవిత, హరీష్‌రావు చాలా బిజీగా ఉన్నారని వెనకేసుకొస్తున్నారు. ఎమ్మెల్సీగా కవిత తాను గతంలో ఎంపీగా పనిచేసిన నిజామాబాద్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టి పనులు చేస్తున్నారని గులాబీ కార్యకర్తలు అంటున్నారు. ఇన్నాళ్లూ ఇనాక్టివ్‌గా ఉండీ ఇప్పుడిప్పుడే యాక్టివ్ అయిన కవిత ప్లీనరీకి ఎందుకు రాలేదన్న ప్రశ్న గులాబీలో కొందరిని వెంటాడుతోందట. మొత్తానికి హరీష్‌రావు ట్రబుల్ షూటర్‌గా ఆపరేషన్ హుజూరాబాద్ చేపడుతుంటే కవితకు త్వరలోనే కీలక పార్టీ పదవో ప్రభుత్వ పదవో కట్టబెడతారనే ప్రచారం జరుగుతోంది. మరి ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.