కాక రేపుతున్న దుబ్బాక ఉప ఎన్నిక!

Update: 2020-10-03 08:00 GMT

తెలంగాణను హీటెక్కిస్తున్న దుబ్బాక ఉప ఎన్నిక సమరంలో, ఎప్పటికప్పుడు కొత్త ట్విస్టులు చక్కర్లు కొడుతున్నాయి. టీఆర్ఎస్‌ అభ్యర్థి ఆల్రెడీ ఖరారయ్యారు, క్యాంపెయిన్ కూడా చేసుకుంటున్నారని భావిస్తున్న నేపథ్యంలో, మరో ప్రచారం దుబ్బాక యుద్దాన్ని వేడెక్కిస్తోంది. టీఆర్‌ఎస్‌ నుంచి అందరూ ఊహించిన అభ్యర్థి పోటీలో వుండటం కష్టమా? కొత్త లీడర్‌ను తెరపైకి తేవాలని కేసీఆర్‌ డిసైడయ్యారా? అభ్యర్థి విషయంలో కేసీఆర్‌దే తుది నిర్ణయన్న మంత్రి హరీష్ మాటల వెనక మర్మమేంటి?

దుబ్బాక నియోజకవర్గం ఉప ఎన్నికల్లో, అధికార టీఆర్ఎస్‌ నుంచి అభ్యర్థి ఎవరన్న విషయంలో ఇంకా స్పష్టత కనబడటం లేదట. దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి కుటుంబం నుంచే అభ్యర్థి ఉంటారని మొదట్లో వార్తలు వచ్చినా, ఆ విషయంలో ఇంకా స్పష్టమైన ప్రకటన రాకపోవడంతో, టీఆర్ఎస్‌ క్యాడర్ తో పాటు, దుబ్బాక నియోజకవర్గ ప్రజల్లో సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది.

కొన్ని రోజుల క్రితం దుబ్బాక నియోజకవర్గంలోని చెల్లాపూర్ లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో, అభ్యర్థి ఎవరనే విషయంపై, కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు హరీష్ రావు. ప్రతిష్టాత్మకమైన దుబ్బాక బైపోల్‌లో, టీఆర్ఎస్‌ అభ్యర్థి ఎవరనేది తమ అధినేత కేసీఆర్ నిర్ణయిస్తారని, ఆయన ఎవరిని ఎంపిక చేసినా, ప్రజలు బ్రహ్మరథం పట్టాలని విజ్తప్తి చేశారు. మంత్రి హరీష్ రావు చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో కలకలం సృష్టిస్తున్నాయి.

మొదటి నుంచీ రామలింగారెడ్డి భార్య సుజాత అభ్యర్థిగా ఉంటారని నియోజకవర్గ టీఆర్ఎస్‌ నాయకులకు, కార్యకర్తలకు అనధికారికంగా చెప్పారట. ఇప్పుడు మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు పలు అనుమానాలకు తావిస్తున్నాయట. రామలింగారెడ్డి భార్యకే ఇస్తారా లేక అనూహ్యంగా ఎవరైనా కొత్త అభ్యర్థిని రంగంలోకి దింపుతారా అనే అంశం, ఇప్పుడు ఉమ్మడి మెదక్ జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మారిస్తే ఎందుకు మార్చాలనుకునున్నారు? కొత్త అభ్యర్థి ఎవరనేది పొలిటికల్ వర్గాల్లో చర్చనీయాంశం. చూడాలి, ఏం జరుగుతుందో.

Tags:    

Similar News