ప్రతిభకు పట్టాభిషేకం.. గిరిజన కళకు అరుదైన గౌరవం
గుస్సాడీ నృత్యకారుడు కనకరాజుకు పద్మశ్రీ సంబురాల జాతర చేసుకుంటున్న గిరిజన పల్లెలు గిరిజన కళకు వైభవం తీసుకువచ్చిన కనకరాజుకు అభినందనలు
ప్రతిభకు పట్టాభిషేకం గిరిజన కళకు లభించిన అరుదైన గౌరవం. ఆదివాసి సంస్కృతికి అపురూప గుర్తింపు కళారంగంలో గుస్సాడీ నృత్యకారుడు కనకరాజుకు పద్మశ్రీ వరించింది. దీంతో ఆదివాసీ వాడల్లో సంబరాలు అంబరాన్ని తాకాయి. గిరిజన కళకు గుర్తింపు ఇచ్చిన భారత ప్రభుత్వానికి ఆదివాసీ లోకం ధన్యవాదాలు తెలుపుతోంది. 81 ఏళ్ల వయస్సులో పద్మశ్రీకి ఎంపికైన కనకరాజు లైఫ్‌స్టైల్‌పై హెచ్‌ఎంటీవీ స్పెషల్ ఫోకస్.
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం మార్లవాయి గ్రామం. ఈ గిరిజన పల్లె ఇప్పుడు సంబురాల జాతర చేసుకుంటోంది. తమ కళావైభవం చూడండి అంటూ గొంతు విప్పుతూ పాదం కదుపుతోంది.ఈ గిరిజనగూడెంలో ఉండే 81ఏళ్ల కళాకారుడు కనకరాజుకి పద్మశ్రీ వరించింది. తండ్రి రాము భాయి నుంచి నేర్చుకున్న గుస్సాడీ కళా ఇప్పుడు కనకరాజుకు దేశస్థాయి గుర్తింపు తీసుకువచ్చింది.
కనకరాజుకు చిన్నతనం నుంచే సంస్కృతి, సాంప్రదాయాలంటే ఇష్టం. అందులో గుస్సాడీ నృత్యమంటే కనకరాజుకు ప్రాణం. పేదరికం వెంటాడుతున్నా పరిస్థితులు పరీక్ష పెడుతున్నా గుస్సాడీ కళను వదలలేదు. ఆ పట్టుదలే ఇప్పుడు కనకరాజుకు పద్మశ్రీ వచ్చేలా చేసింది.
ఆదివాసులగూడెలకు పరిమితమైన గుస్సాడీ నృత్యాన్ని కనకరాజు ఢిల్లీ వరకు తీసుకువెళ్లారు. అప్పట్లో దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ముందు గుస్సాడీ నృత్య ప్రదర్శన చేసి శభాష్ గిరిపుత్రుడా అనిపించుకున్నారు. 1982 రిపబ్లిక్ వేడుకల్లో ఎర్రకోట వద్ద కనకరాజు కాలు కదిపి మెప్పించారు.
ఆదివాసుల అభివృద్ధికి కృషి చేసిన హైమన్ డార్ఫ్‌కు అత్యంత సన్నిహితంగా మెలిగారు కనకరాజు. అప్పట్లో ఆయన సాయంతో 30 ప్రాథమిక పాఠశాలలు ప్రారంభించారు. హైమన్ డార్ఫ్ హయాంలో ఆదివాసీలు 47వేల ఎకరాల పొడు భూమి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కనకరాజు కీలక పాత్ర పోషించారు.
గిరిజిన కళకు పద్మశ్రీ రావడం తనకు చాలా ఆనందంగా ఉందని కనకరాజు అన్నారు. తమ తరంతో ఈ కళ ఆగిపోకూడదని కొంత మందికి గుస్సాడీ నేర్పిస్తున్నట్లు వెల్లడించారు. పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన కనకరాజును జిల్లా కలెక్టర్ రాహుల్‌రాజు అభినందించారు. కనకరాజుకు పద్మశ్రీ రావడం గిరిజన లోకానికే గర్వకారణమని చెప్పారు.
ఇటు గిరిజనసంఘాలు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. గిరిజన కళాకు అరుదైన గుర్తింపు లభించిందని చెబుతున్నారు. కనకరాజు గిరిజన వైభావాన్ని అతిగొప్పగా చాటిచెప్పారని అభినందిస్తున్నారు. పట్టుదల ముందు ఎంతటి విజయమైనా బానిసా కావాల్సిందే అని కనకరాజు నిరూపించారు. గిరిజన కళకు వైభవం తీసుకువచ్చిన కనకరాజుకు హెచ్‌ఎంటీవీ కూడా శుభకాంక్షలు తెలుపుతోంది.