తెలంగాణలో పెరుగుతున్న గన్ కల్చర్.. కలకలం రేపుతున్న కాల్పుల మోత...
TS News: రాజస్థాన్, మధ్యప్రదేశ్, బిహార్ రాష్ట్రాల నుంచి రవాణా...
TS News: తెలంగాణ రాష్ట్రంలో తుపాకీ కల్చర్ పెరుగుతోంది. అక్రమంగా ఆయుధాలు తెచ్చుకుని ప్రత్యర్థులను మట్టుబెడుతున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. రాష్ట్రంలో సంచలనం రేపిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు రివాల్వర్లు తెచ్చుకున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కర్ణంగూడలో స్థిరాస్తి వివాదంలోనూ నిందితులు.. అక్రమా ఆయుధాలనే వినియోగించారు. రాష్ట్రంలో అసాంఘిక శక్తులు వినియోగిస్తున్న ఆయుధాల్లో 80 శాతం వరకూ రాజధానిలోనే ఉన్నాయని తెలుస్తోంది. దీంతో అలెర్టయిన పోలీసులు.. గన్స్ ఎక్కడి నుంచి తెస్తున్నారో తేల్చే పనిలో పడ్డారు.
ఎక్కువగా రాజస్థాన్, మధ్యప్రదేశ్, బిహార్ రాష్ట్రాల నుంచి అక్రమ తుపాకీలను తెప్పించుకుంటున్నారు. పోలీసులకు అనుమానం రాకుండా రైళ్లు, అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల్లో వస్తున్నారు. రైళ్లల్లో తనిఖీలు లేకపోవడంతో సురక్షిత రవాణాగా భావిస్తున్నారు. కాచిగూడ, నాంపల్లి, సికింద్రాబాద్‌కు టిక్కెట్లు తీసుకొని, ఫలక్‌నుమా, మౌలాలి తదితర శివారు రైల్వే స్టేషన్‌లలో దిగి వెళ్లిపోతున్నారు.
వెపన్స్ అవసరం ఉన్న కొందరు బిహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో ఈజీగా తుపాకులను కొనుగోలు చేసి నగరంలో విక్రయిస్తున్నారు. మరికొందరు నేరుగా అక్కడికే వెళ్లి కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. ఆయా ప్రాంతాల్లో 2 వేల నుంచి 50వేల లోపే వెపన్ లభిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో అధికారుల లెక్కల ప్రకారం 9వేలకు పైగా లైసెన్స్‌డ్ గన్స్ ఉన్నాయి. అయితే ఇటీవల జరుగుతున్న ఘటనలో తుపాకీలు ఎలా వస్తున్నాయనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.