హైదరాబాద్‌లో పెరుగుతున్న ప్లాస్టిక్ వినియోగం
Hyderabad: 120 మైక్రాన్‌ల మందం కలిగిన ప్లాస్టిక్‌ను నిషేధిస్తూ నిర్ణయం
Hyderabad: హైదరాబాద్‌లో ప్లాస్టిక్ వినియోగం రోజు రోజుకు పెరిగిపోతోంది. తాజాగా తెలంగాణ వ్యాప్తంగా జులై ఒకటి నుంచి 120 మైక్రాన్ ల కంటే తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ ను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్‌లో రోజూ ఉత్పత్తి అయ్యే 5 వేల టన్నుల చెత్తలో 600 టన్నుల వరకూ ప్లాస్టిక్ ఉత్పత్తులే ఉండటం ఆందోళనకరంగా మారింది. గతంలో 50 మైక్రాన్ల కన్న తక్కువగా ఉండే కవర్లపై జీహెచ్ఎంసీ విధించిన నిషేధం నామమాత్రంగా తయారయ్యింది. 50 మైక్రాన్ల కన్నా తక్కువగా ఉండే ప్లాస్టిక్ కవర్ల వినియోగం జోరుగా సాగుతోంది.
నగరంలో పూర్తి స్థాయిలో ప్లాస్టిక్ పై నిషేధం విధిస్తూ జీహెచ్ఎంసీ కౌన్సిల్ లో తీర్మానం చేయగా దీనిపై విభిన్న వాదనలు వినిపించాయి. 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్నప్లాస్టిక్‌ను నిషేధిస్తున్నట్లు పురపాలకశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని నగర పాలక సంస్థలు, పురపాలక సంఘాల్లో దీన్ని అమలు చేయాలని పురపాలకశాఖ నుంచి ఆదేశాలు వచ్చాయి. కాని హైదరాబాద్ లో అమలు అవుతుందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ప్లాస్టిక్ వాడడమే కాదు.. తయారీ, సరఫరా, విక్రయం, వినియోగంపై కూడా నిషేధం అమల్లో ఉండబోతుంది. నిషేధం అమలుకు కొన్ని ప్రత్యేక చర్యలు చేపట్టబోతున్నారు. నిషేధంపై విస్తృత ప్రచారం కల్పిస్తూ... పటిష్ట అమలుకు టాస్క్‌ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. నిబంధనలు అతిక్రమించేవారి నుంచి జరిమానా వసూలు చేయనున్నారు. దుకాణాల్లో మొదటిసారి పట్టుబడితే 2500 నుంచి 5వేల దాకా జరిమానా విధించనున్నారు. నిషేధించిన ప్లాస్టిక్ బ్యాగులను ఎక్కడ పడితే అక్కడ పారేసే వ్యక్తులపై 250 నుంచి 500 రూపాయల వరకు జరిమానా విధించనున్నారు.
మున్సిపాలిటీ, కార్పొరేషన్‌లలో శానిటరీ సూపర్‌వైజర్, శానిటరీ ఇన్‌స్పెక్టర్, స్వచ్చంద సేవా సంస్థ ప్రతినిధులు ఇద్దరు, పోలీస్ కానిస్టేబుల్‌తో టాస్క్‌ఫోర్స్ కమిటీలు ఏర్పాటు కానున్నాయి. వీటికి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించడంతో పాటు వారంలో కనీసం రెండుసార్లు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేసి అతిక్రమణదారులపై చర్యలు తీసుకుంటారు. అయితే ముందుగా ప్రభుత్వం అవగాహన కల్పించాలంటున్నారు నగరవాసులు.పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ నిషేధం చేయాలని ప్రభుత్వం చేస్తున్న పనిలో... అందరూ భాగస్వామ్యం కావాలని పర్యావరణాన్ని రక్షించాలని స్వచ్చంద సంస్థలు కూడా కోరుతున్నాయి.