అచ్చం అలానే..అప్పడు వరంగల్..ఇప్పుడు షాద్ నగర్ లో! గ్రేట్ ఐపీఎస్ సజ్జనార్!!

దిశా హత్యనిందితుల ఎంకౌంటర్ పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది!

Update: 2019-12-06 04:52 GMT
Accused encounter

సేమ్ టు సేమ్.. అచ్చం అలాగే.. ఇంకా ఎన్ని చెప్పినా ఈ ఘటనకు తక్కువే. అప్పుడు స్వప్నిక.. ఇప్పుడు దిశ.. రెండు కేసుల్లోనూ క్లైమాక్స్ ఒకటే. సరిగ్గా పదకొండు సంవత్సరాల క్రితం ఎలా జరిగిందో అదేవిధంగా ఈరోజూ జరిగింది.

దిశ..కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా సంచలనం గా మారిన పేరు. నిస్సహాయంగా ఆమె అర్థరాత్రి చేసిన రోదనలు.. ఆమె పడిన నరకం.. సరిగ్గా అలాంటి అనుభవమే..అదే ప్రదేశంలో అనుభవించారు నిందితులు. ఒక ఆబలను దారుణంగా చంపేసిన నిందితులపై వెల్లువెత్తిన ప్రజాగ్రహం ఈరోజు వారి ఎన్కౌంటర్ కు దారితీసింది.

సరిగ్గా పదకొండేళ్ళ క్రితం స్వప్నిక.. ప్రేమించను అని చెప్పినందుకు ముష్కరుల చేతిలో మృత్యువాత పడింది. అప్పుడు ఆమె పరిస్థితి పై ప్రజాగ్రహం వెల్లువెత్తింది. దానికి జవాబు ఆ కిరాతకుల ఎన్కౌంటర్ తో దొరికింది.

ఈ రెండు కేసుల లోనూ సారూప్యం చాలా ఉంది. జరిగిన అన్యాయం దాదాపుగా ఒక్కటే. దిశ కేసులో ఆమెను సజీవదహనం చేశారు. స్వప్నిక కేసులో ఆమెను యాసిడ్ పోసి చంపారు. అప్పుడు నిందితులు ముగ్గురు. ఇప్పుడు నిందితులు నలుగురు. వరంగల్ లో జరిగిన స్వప్నిక కేసులో సీన్ రీ కనస్త్రక్ట్ చేస్తుండగానే ఎన్కౌంటర్ జరిగింది. ఇప్పుడు షాద్ నగర్ దగ్గరలో జరిగిన దిశ కేసులోనూ సీన్ రీ కనస్త్రక్ట్ చేస్తుండగానే ఎన్కౌంటర్ చోటు చేసుకుంది.

అప్పుడూ, ఇప్పుడూ ఈ కేసులను పర్యవేక్షించింది ఒక్కరే పోలీసు అధికారి. ఆయనే ఐపీఎస్ సజ్జనార్!

ప్రస్తుతం ఈ రెండు కేసుల మధ్య ఉన్న పోలికలను వివరిస్తూ.. సోషల్ మీడియాలో కథనాలు విపరీతంగా వస్తున్నాయి. పోలీస్ అధికారి ఐపీఎస్ సజ్జనార్ ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

అసలు అప్పుడు స్వప్నికకు ఏం జరిగింది..

2008 డిసెంబర్‌లో వరంగల్‌లో ఇంజనీరింగ్ చదువుతున్న స్వప్నిక తన స్నేహితురాలుతో కలిసి స్కూటీపై కాలేజీకి వెళుతోంది. అదే సమయంలో మార్గ మధ్యలో మాటు వేసిన శ్రీనివాస్ అనే యువకుడు స్వప్నికపై యాసిడ్‌తో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన స్వప్నికను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.. ఆరోగ్య పరిస్థితి ఆందోళనగా ఉండటంతో.. సికింద్రబాద్‌లోని యశోదా ఆస్పత్రికి తీసుకొచ్చారు. అక్కడ చికిత్సపొందుతూ ఆమె చనిపోయింది. స్కూటీ వెనుక కూర్చొన్నఆమె స్నేహితురాలికి తీవ్ర గాయాలు అయ్యాయి. అప్పుడు తెలుగు రాష్ట్రాలు కలిసి ఉన్నాయి. ఆ సమయంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు.

ఈ ఘటనలో నిందితుడితో పాటూ అతడికి సహకరించిన స్నేహితుల్నిపోలీసులు అరెస్ట్ చేశారు. అదే సమయంలో పోలీసులు అరెస్ట్ చేసిన నిందితుల్నిఘటన జరిగిన ప్రదేశానికి తీసుకెళ్లిన సమయంలో.. పారిపోయేందుకు ప్రయత్నించడంతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు నిందితులు చనిపోయారు.

ఈ ఘటన సమయంలో ముఖ్యమంత్రిగా వైఎస్సార్ ఉంటె.. ఇప్పుడు సైబరాబాద్ సీపీగా ఉన్న సజ్జనార్ అప్పుడు వరంగల్ జిల్లా ఎస్పీగా ఉన్నారు.

ప్రస్తుతం..

సరిగ్గా దిశ కేసులోనూ ఇదే జరిగింది. నవంబర్ 28న ఆమె పై దురాగతానికి పాల్పడిన దుండగులను నలుగురిని పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారు. వారిని కోర్టు రిమాండ్ కు పంపించింది. తరువాత, పోలీసుల అభ్యర్ధన మేరకు కేసు దర్యాప్తులో భాగంగా నిందితులను పోలీస్ కస్టడీకి కోర్ట్ అప్పచెప్పింది.

ప్రభుత్వమూ ఈ కేసు సత్వర విచారణ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఏర్పాటు చేసింది. ఐపీఎస్ సజ్జనార్ నేతృత్వంలో గురువారమే ప్రత్యెక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో నిందితులను విచారిస్తున్న సిట్.. సాక్ష్యాల సేకరణ కోసం సీన్ రీ కనస్త్రక్ట్ చేయడానికి ఘటనా స్థలానికి నిందితులను తీసుకు వెళ్ళింది. అక్కడ వారు తప్పించుకునే ప్రయత్నం చేస్తుండగా పోలీసులు వారిని కాల్చి చంపారు.

మొత్తమ్మీద దిశ హత్య కేసులో దున్దగుల్ని పోలీసులు కాల్చి చంపడాన్ని సమాజం హర్షిస్తోంది. అక్కడక్కడా మానవహక్కుల సన్నాయి నొక్కులు వినిపించినా.. నిందితులు చేసిన దురాగతం ముందు అవేవీ వినిపించడం లేదు. ఇప్పుడు అందరిదీ ఒకే మాట జై పోలీస్! జై జై పోలీస్!! 

Tags:    

Similar News