MLC Kavitha: కవిత దీక్షకు సర్కారు బాసట
MLC Kavitha: మహిళా మంత్రులు సబిత, సత్యవతికి బాధ్యతలు
MLC Kavitha: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలో ఇవాళ చేస్తున్న దీక్షకు రాష్ట్ర మంత్రిమండలి మద్దతు తెలిపింది. దీక్షపై రాజకీయపరమైన నిర్ణయాన్ని ప్రకటించింది. దీనికి బాసటగా నిలవాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులను ఆదేశించారు. ప్రత్యేకంగా ఇద్దరు మహిళా మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌లకు బాధ్యతలు అప్పగించారు. క్యాబినెట్ భేటీలో.. ఢిల్లీ లిక్కర్ కేసు ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ల బిల్లు డిమాండ్‌తో.. నేడు ఢిల్లీలో కవిత ధర్నా చేపట్టడానికి ముందు.. ఈనెల 9న విచారణకు హాజరు కావాలంటూ ఈడీ సమన్లు పంపడంపై సీఎంతోపాటు మంత్రులు కొంత ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిసింది.
ఇలాంటి కష్టకాలంలో కవితకు అండగా నిలవాలని మంత్రివర్గం నిర్ణయించింది. అదే సమయంలో, కవిత విషయంలో సీరియ్‌సగా స్పందించలేదంటూ కొందరు మంత్రులపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. కవిత దీక్షకు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ హాజరు కావాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. మహిళా బిల్లుపై ఒక మహిళా ఎమ్మెల్సీ దీక్ష చేపడుతున్నందున.. మహిళా మంత్రులే వెన్నుదన్నుగా నిలవాలని చెప్పారు.
నిన్న తెలంగాణ క్యాబినెట్ సమావేశం కొనసాగుతుండగానే.. మధ్యలో నుంచే సబిత, సత్యవతి విమానాశ్రయానికి వెళ్లిపోయారు. నేడు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగే దీక్షకు ఇద్దరు మంత్రులు రాష్ట్ర ప్రభుత్వం తరపున పాల్గొని, కవితకు బాసటగా నిలవనున్నారు. ఇక, మంత్రి కేటీఆర్ కూడా ఢిల్లీ వెళ్లే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇది తప్ప మిగతా రాజకీయ అంశాలు క్యాబినెట్ భేటీలో పెద్దగా చర్చకు రాలేదని తెలుస్తోంది.