సమస్యలకు నిలయం ప్రభుత్వ హాస్టళ్లు
Hostels: కనీస సదుపాయాలు లేక విద్యార్ధుల ఇబ్బందులు
Hostels: ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు సమస్యలకు నిలయాలుగా మారుతున్నాయి. కొవిడ్ నేపద్యంలో రెండేళ్లుగా మూతపడిన వసతి గృహాలు ఈ ఏడాది తెరుచుకున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపంతో అస్తవ్యస్తంగా మారాయి. ఖమ్మం జిల్లాలో సంక్షేమ హస్టళ్లు దయనీయంగా మారాయి.
తెలంగాణలో ప్రభుత్వ వసతి గృహాలు నరకప్రాయంగా మారుతున్నాయి. రెండేళ్ల విరామం తర్వాత హస్టళ్లు తెరుచుకున్నాయి. ఖమ్మం జిల్లాలో ఎస్సీ, ఎస్టీ బీసీ గిరిజన సంక్షేమ శాఖల ఆద్వర్యంలో నిర్వహిస్తున్న వసతి గృహాల్లో కనీస సదుపాయాలు లేక విద్యార్ధులు ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్ధులు కనీసం తాగేందుకు మంచినీరు కూడా లబించని పరిస్థితి ఏర్పడింది. ఇక బాత్ రూమ్స్ దుస్ధితి ఎవరికి చెప్పుకోలేని విధంగా ఉంది. హస్టళ్లను మరమ్మత్తు చేయించాల్సిన యంత్రాంగం పూర్తిగా నిర్లక్ష్యం చూపడంతో కొన్ని భవనాలు శిథిలావస్తుకు చేరుకుని.. బూత్ బంగ్లాలను తలపిస్తున్నాయి.
ఖమ్మం జిల్లాలో వందకు పైగా ఉన్న వివిధ సంక్షేమ హస్టళ్లలో ఐదు వేల మంది విద్యార్ధులు ఆశ్రయం పొందుతున్నారు. వీరికి కార్పోరేట్ సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తున్నా.. అధికారులు, సిబ్బంది అలసత్వంతో నీరుగారుతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా బాలికల వసతి గృహాల పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉంది. చెదలు పట్టిన తలుపులు, కిటికీలు, డోర్లు లేని బాత్రూంల మధ్య విద్యార్ధులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.
హాస్టళ్లలో భోజన మెనూ కూడా సక్రమంగా అమలు చేయడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హస్టళ్లలో సమస్యలను అధికారులకు చెబితే వేధింపులకు గురి చేస్తున్నారని..ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకుని వసతిగృహల పనితీరు మెరుగు పర్చాలని ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.