వరంగల్ జిల్లాలోని గీసుకొండ మండలం గొర్రెకుంటలో బావిలో 9మంది మృతదేహాలు లభ్యం అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సంఘటన రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపుతుంది. అసలు ఈ ఘటన హత్యా? ఆత్మహత్యా? అనే సందేహం తలెత్తింది. అయితే, తాజాగా ఈ కేసు మిస్టరీ వీడినట్లుగా సమాచారం. పోలీసుల విచారణలో నిందితుడు సంజయ్ కుమార్ యాదవ్ నేరం అంగీకరించినట్లు తెలుస్తోంది. శీతల పానీయంలో నిద్ర మాత్రలు కలిపి.. అపస్మారక స్థితిలోకి వెళ్లాక వారిని బావిలో పడేసినట్లు విచారణలో వెల్లడైంది. పశ్చిమబెంగాల్‌కు చెందిన ఎండీ మక్సూద్ కుమార్తెతో ఉన్న వివాహేతర సంబంధం.. ఇతరులతో ఆమె సన్నిహితంగా ఉంటుందన్న కసితో సంజయ్ ఈ వరుస హత్యలకు పాల్పడినట్లు తెలుస్తోంది.
కాగా పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఎండీ మక్సూద్ 20 ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం కుటుంబంతో సహా వరంగల్‌కు వలస వచ్చాడు. నగరంలోని కరీమాబాద్ ప్రాంతంలో వీరంతా అద్దె ఇంట్లో ఉండేవారు. ఇక డిసెంబర్ నుంచి వీరు గీసుకొండ మండలం గొర్రెకుంట ప్రాంతంలోని ఓ గన్నీ సంచుల తయారీ గోదాంలో పని చేస్తున్నారు. లాక్‌డౌన్ కారణంగా వరంగల్ నుంచి రాకపోకలకు ఇబ్బందిగా ఉండటంతో.. నెలన్నర నుంచి గోదాం పక్కనే ఉన్న రెండు గదుల్లో మక్సూద్ కుటుంబం ఉంటోంది. మక్సూద్ కుమారుడి పుట్టినరోజు వేడుకలకు శీతల పానీయాల్లో నిద్ర మాత్రలు కలిపిన నిందితుడు.. వారు అపస్మారక స్థితిలోకి వెళ్లగానే ఒక్కొక్కరిని బావిలో పడేసి హత్య చేసినట్లు విచారణలో తేలింది.