నేటి నుంచి తెలంగాణలో పదోన్నతుల ప్రక్రియ..సిఎం కేసీఆర్ హామీ అమలయ్యేనా?
* డీపీసీల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు * జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు * ముఖ్య కార్యదర్శులతో సీఎస్ సోమేష్ కుమార్ సమావేశం * నెలాఖరులోగా యుద్ధప్రాతిపదికన పదోన్నతులు
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి సారిగా రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులకు పదోన్నతుల ప్రక్రియ ఇవాల్టి నుంచి ప్రారంభం కానుంది. అందుకోసం ప్రిన్సిపల్ సెక్రటరీలతో సీఎస్ సోమేష్ కుమార్ సమావేశం ఏర్పాటు చేసి కార్యాచరణను ప్రకటించారు. జనవరి చివరి కల్లా ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియను పూర్తిచేసి. ఖాళీ ఉద్యోగుల లిస్ట్‌ను తయారు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
రాష్ట్ర సచివాలయం, ప్రిన్సిపల్ సెక్రటరీల కార్యాలయాలతో పాటు జిల్లా కలెక్టరేట్లలోనూ ఈ ఉద్యోగుల పదోన్నతులపై కసరత్తు జరగనుంది. రాష్ట్రంలో 34 ప్రధాన శాఖలున్నాయి. వాటికి అనుబంధంగా మరో 40 డిపార్ట్‌మెంట్‌లున్నాయి. వాటితో పాటు మరో 104 కార్యాలయాలున్నాయి. తెలంగాణలో 33 జిల్లాలున్నాయి. దాంతో వీటన్నింటి లిస్ట్ చూస్తే వేల మందికి పదోన్నతులు రానున్నట్టు తెలుస్తోంది.
పదోన్నతుల ప్రక్రియకు జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో డీపీసీ ఏర్పాటవుతోంది. ఈ కమిటీలో జాయింట్ కలెక్టర్, డిపార్ట్‌మెంట్‌కు సంబంధించిన అధికారి ఉంటారు. జిల్లా పరిధిలోని నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు పదోన్నతులు ఇస్తారు. అదే గెజిటెడ్ ఉద్యోగుల పదోన్నతి సీఎస్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఏర్పాడే డీపీసీలో ఆధీనంలో ఉంటాయి. పదోన్నతులకు సీనియారిటీని పరిగణలోకి తీసుకుంటారు. అందులోనూ ఆ ఉద్యోగి పనితీరు, నడవడికను పరిశీలించాక అర్హులుగా పరిగణిస్తారు.
అయితే.. సర్వీసు నిబంధనల ప్రకారం ఏ ఉద్యోగానికైనా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మూడేళ్ల కాలం పూర్తి చేసుకుంటేనే వారు పదోన్నతులకు అర్హులవుతారు. ఈ మూడేళ్లను రెండేళ్లకు తగ్గించాలని ఉద్యోగ సంఘాల నేతలు కోరుతున్నారు. అందుకోసం సీఎం కేసీఆర్ అంగీకరించి ఆదేశాలు జారీ చేశారు. ఇన్నాళ్లుకు పదోన్నతులు రావడంతో. మూడేళ్ల పదవీ కాలం ఉంచుతారా. సీఎం ఆదేశాల ప్రకారం రెండేళ్లకు కుదిస్తారా అనేది ఆసక్తిగా మారింది.