ఆర్థిక సంక్షోభంలో జీహెచ్ఎంసీ.. బాదుడుకు రంగం సిద్ధం..?

GHMC Financial Crisis: జీహెచ్‌ఎంసీ అప్పుల కుప్పగా మారుతోంది.

Update: 2021-07-10 02:50 GMT

ఆర్థిక సంక్షోభంలో జీహెచ్ఎంసీ.. బాదుడుకు రంగం సిద్ధం..? 

GHMC Financial Crisis: జీహెచ్‌ఎంసీ అప్పుల కుప్పగా మారుతోంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ నగర పాలక సంస్థ ఖజానా ఖళీ అయింది. అభివృద్ధి పనులకు భారీగా నిధులు వెచ్చించిన సంస్థ ఆశించినంత ఆదాయాన్ని సాధించలేకపోతుంది. చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేని స్థితికి బల్దియా చేరుకుందా? హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చే కృషిలో కీలక పాత్ర నిర్వర్తిస్తున్న సంస్థ మున్ముందు పైసా పని చేయలేని దుస్థితికి దిగజారుతోంది.

జీహెచ్‌ఎంసీ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొటుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులకు ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో ఆర్ధిక పరిస్థితి దయనీయంగా తయారైంది. నగరంలో వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులకు రూపకల్పన చేసిన ప్రభుత్వం వాటి కోసం ఇప్పటివరకు ఆర్దికంగా ఎలాంటి చేయూత అందించలేదు. అసలే ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతున్న జీహెచ్ఎంసీ పరిధిలో కొత్త ప్రాజెక్టుల శంకుస్థాపనలు కొనసాగుతూనే ఉన్నాయి. పథకాల అమలు కోసం జీహెచ్‌ఎంసీ ఇప్పటికే అందినంత మేర అప్పులు చేసింది. వివిధ ప్రాజెక్టుల కోసం జీహెచ్‌ఎంసీ ఇప్పటి వరకు 4,595 కోట్ల అప్పు చేసింది. గత ఆర్థిక లావాదేవీల ఆధారంగా రుణాలు మంజూరు చేసిన బ్యాంకులు, ఇతర సంస్థలు ప్రస్తుత పరిస్థితుల్లో ఇకపై అప్పు ఇవ్వడం అసాధ్యంగా కనబడుతోంది.

జీహెచ్ఎంసీ చేసిన అప్పులకు ప్రస్తుతం నెలకు 30 కోట్లు వడ్డీ చెల్లిస్తున్నారు. అసలు చెల్లింపు కూడా మొదలైతే దాదాపు 100 కోట్ల వరకు పెరగవచ్చని అంచనా. గ్రేటర్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దే క్రమంలో ఎస్సాఆర్డీపీ, ఎస్ఎన్‌డీపీలతోపాటు మెరుగైన రోడ్ల నిర్వహణ కోసం సీఆర్‌ఎంపీ చేపట్టారు. ఇందులో ఎస్‌ఆర్‌డీపీ వాటా 29 వేల కోట్లు కాగా, 6 వేల కోట్లతో కొన్ని పనులు పూర్తి చేశారు. సీఆర్‌ఎంపీకి 1,687 కోట్లు అవసరం. ఎస్‌ఎన్‌డీపీ కోసం మొదటి విడతగా 858 కోట్లు అవసరం. జీహెచ్‌ఎంసీ వార్షిక ఆదాయం 3,200 నుంచి 3,500 కోట్లు మాత్రమే ఉంది. ఇందులో వేతనాలు, పెన్షన్లకు సంవత్సరానికి 1,500 కోట్లు అవసరం. పారిశుధ్యం, రోడ్ల నిర్వహణ, ఇతరత్రా పనులకు 2,500 కోట్ల వరకు వెచ్చిస్తుంటారు. రుణాలకు వడ్డీగా యేటా 40 కోట్ల వరకు చెల్లిస్తున్నారు. ఈ లెక్కన సంస్థకు వచ్చే ఆదాయంతో పోలిస్తే ఖర్చులు, చెల్లింపులు అధికంగా ఉన్నాయి.

గ్రేటర్ హైదరాబాద్‌లో అభివృద్ధి పనుల కోసం చేసిన రుణాలు జీహెచ్ఎంసీ ఎలా తీరుస్తుందనే అంశం ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. ఆర్దిక ఇబ్బందుల నుంచి గట్టేందుకు ప్రభుత్వం ఆదుకోకపోతే నగరవాసులపై భారం మోపడం ఖాయమని తెలుస్తోంది.

Tags:    

Similar News