జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రాయణ గుట్ట డివిజన్ పరిధిలోని చాదర్ ఘాట్‌లో ఎంబీటీ నేతలు ఆందోళనకు దిగారు. కొందరు ఓటు వేసిన సిరా చెరిపేస్తున్నారంటూ గొడవ చేశారు. దీంతో అక్కడ రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వాగ్వాదం కాస్త ఘర్షణకు దారి తీయటంతో బాహాబాహీకి దిగాయి రెండు వర్గాలు. రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
కూకట్‌పల్లి ఫోరం మాల్ దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీఆర్‌ఎస్, బీజేపీ నేతల మధ్య ఘర్షణ నెలకొంది. మంత్రి పువ్వాడ ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్ కార్యకర్తలు కారులో వచ్చి డబ్బులు పంపిణీ చేస్తున్నారంటూ బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. డబ్బుతో దొరికితే కారును సీజ్ చేయకుండా పోలీసులు వదిలిపెట్టారని ఆరోపిస్తున్నారు.
ఇక నాచారం డివిజన్ లో కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలింగ్ బూత్ దగ్గర టీఆర్ఎస్ నేతలు పార్టీ కండువాలు వేసుకున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు అభ్యంతరం తెలిపారు. దీంతో రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు.
గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్‌పల్లిలో టీఆర్ఎస్, బీజేపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. రెండు వర్గాలకు చెందిన కార్యకర్తలు వాగ్వాదానికి దిగడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు.