GHMC elections 2020: జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారానికి నిబంధనల జారీ
GHMC Elections 2020: * ప్రచార వాహనాలకు పర్మిషన్ తప్పనిసరి * అభ్యర్థుల ప్రచారం చేసే వాహనాలకు డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ నుంచి పర్మిషన్ తప్పనిసరి * స్టార్ కాంపెయినర్ వాహనాలకు పర్మిషన్ ఇవ్వనున్నఎన్నికల అథారిటీ కమిషనర్, జీహెచ్‌ఎంసీ * పోలింగ్‌కు 48 గంటల ముందు వరకే చెల్లనున్న పర్మిషన్ * రెండుకు మించి వాహనాలు వరుసగా వెళ్లొద్దని ఆదేశం
జిహెచ్ఎంసి ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ పూర్తైంది. దీంతో ఇవాళ్టి నుంచి నగరంలో ప్రచారాల హోరు మరింత పెరగనుంది. ఈ నేపథ్యంలో పార్టీలు, అభ్యర్థులు ముందస్తుగా అనుమతి పొందాల్సిన అంశాలపై మార్గదర్శకాలు విడుదల చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. ప్రచారాలు, వాహనాలకు సంబంధించిన నిబంధనలు జారీ చేసింది.
Ghmc ఎన్నికలకు ప్రచారాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థులకు మరిన్ని మార్గదర్శకాలు ప్రకటించింది రాష్ట్ర ఎన్నికల సంఘం. అభ్యర్ధులు ప్రచారం చేసే వాహనాలకు సంబంధిత డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ నుండి పర్మిషన్ పొందాలని తెలిపింది. స్టార్ కాంపెయినర్లు వాడే వాహనాలకు ఎన్నికల అథారిటీ కమిషనర్, జిహెచ్ఎంసి నుండి ముందస్తు అనుమతి తీసుకోవాలంది. స్టార్ కాంపెయినర్ పేరు వాహనం రిజిస్ట్రేషన్ నంబరు, వాహనం వాడే తేదీలు, ప్రాంతాలు పొందుపరచి జారీ చేయనున్నారు అధికారులు.
ఇక ప్రచార వాహనాలకు ఇచ్చే పర్మిషన్ పోలింగ్‌కు 48 గంటల ముందు వరకు మాత్రమే చెల్లుతుంది. అనుమతి లేకుండా ప్రచారంలో పాల్గొన్న వాహనాలను సీజ్ చేయడంతో పాటు సంబంధిత అభ్యర్థిపై ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం చర్యలుంటాయని స్పష్టం చేసింది ఈసీ. పోలింగ్ రోజు ఒక అభ్యర్థికి ఒక వాహనం మాత్రమే అనుమతించబడుతుంది. ఇందుకు విడిగా.. డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ నుండి పర్మిషన్ తీసుకోవాలంది ఈసీ. పర్మిషన్ లెటర్ ను వాహనం ముందు అద్దంపై స్పష్టంగా కనిపించేలా ఉంచాలని పేర్కొంది.
అయితే ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకొని ప్రచారంలో రెండుకు మించి వాహనాలు వరుసగా వెళ్లొద్దనిఆదేశించింది ఈసీ. అంతకుమించి వాహనాలుంటే ప్రతి రెండు వాహనాల మధ్య 100 మీటర్ల దూరం పాటించాలని తెలిపింది. ప్రభుత్వ వాహనాలు ప్రచారంలో వాడటాన్ని నిషేధించింది.