GHMC Elections 2020: ప్రశాంతంగా ప్రారంభమైన పోలింగ్..ఓటు వేసిన ప్రముఖులు!

బల్దియా ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నాయి.

Update: 2020-12-01 04:16 GMT

GHMC Elections 2020

అన్ని ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జీహెచ్ఎంసీ ఎన్నికలు ప్రశాంతంగా ప్రారంభం అయ్యాయి. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభించారు. పోలింగ్ కోసం కోవిడ్ నిబంధనలతో పటిష్ట ఏర్పాట్లు చేశారు అధికారులు. అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ క్యూలైన్ల ఏర్పాటు.. శానిటైజ్ చేసుకునే ఏర్పాట్లు చేశారు. ఓటర్ ఐడీ కార్డుతో పాటూ.. మాస్క్ కూడా ఉంటేనే పోలింగ్ కు అనుమతి ఇస్తున్నారు. అదేవిధంగా సెల్ ఫోన్ పోలింగ్ వద్దకు అనుమతించడం లేదు. దాదాపుగా అన్ని ప్రాంతాల్లోనూ పోలింగ్ మందకొడిగా ప్రారంభం అయింది. అడ్డగుట్ట ప్రాంతంలో మాత్రం అన్ని పోలింగ్ కేంద్రాల వద్దా ఓటర్లు ఉదయాన్నే బారులు తీరారు. ఉదయం 9 గంటల వరకు 3.10 శాతం పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

ఇదిలా ఉంటె పలువురు ప్రముఖులు ఉదయాన్నే తమ ఓటు హక్కు వినియోగించుకోవడమే కాకుండా ప్రజలకు ఓటు వేయాలంటూ పిలుపు ఇచ్చారు. కుందన్ బాగ్‌లోని పోలింగ్‌ కేంద్రంలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్‌ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. తెలంగాణ మంత్రి కేటీఆర్‌, శైలిమ దంపతులు జారాహిల్స్‌లోని నందినగర్‌ పోలింగ్‌ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి దంపతులు కాచిగూడలోని దీక్షా మోడల్ స్కూల్ పోలింగ్ కేంద్రంలో, జూబ్లీ హిల్స్‌లోని జూబ్లీక్లబ్‌ పోలింగ్‌ కేంద్రంలో ప్రముఖ నటుడు చిరంజీవి దంపతులు, ఫిల్మ్‌నగర్‌ క్లబ్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ, నిర్మాత శ్యాంప్రసాద్‌రెడ్డి, చిక్కడపల్లిలోని పోలింగ్‌ కేంద్రంలో భాజపా నేత లక్ష్మణ్‌, నాంపల్లిలోని వ్యాయామశాఖ పోలింగ్‌ కేంద్రంలో సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌, శాస్త్రిపురంలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ, బోరబండలోని సైట్‌వన్‌ పోలింగ్‌ కేంద్రంలో ఉపమేయర్‌ బాబా ఫసియుద్దీన్‌ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

హఫీజ్ పేట్ డివిజన్ లో కాస్త ఘర్షణ వాతావరణం ఏర్పడింది. టీఆరెస్ అభ్యర్థులు ఫ్లెక్సీ ఏర్పాట్లు చేయడంపై బీజేపీ కార్యకర్తలు అభ్యంతరం చెప్పడంతో రెండు పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వాదం చెలరేగింది. ఆర్కే పురం పోలింగ్ బూత్ వద్ద టీఆర్ఎస్ నేతలను బీజేపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో ఇక్కడ ఘర్షణ ఏర్పడింది. మరోవైపు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలు దీక్షకు దిగారు. Ghmc ఎన్నికల్లో trs అధికార దుర్వినియోగాన్ని నిరసిస్తూ ఉపవాస దీక్ష చేస్తున్నారు. దీక్షలో కూర్చోనున్న పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ , మాజీ ఎంపీ వివేక్ పాల్గొన్నారు.

Tags:    

Similar News