గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం ఏడు గంటలకు మొదలైన GHMC పోలింగ్ సాయంత్రం 6గంటల వరకు కొనసాగింది. పోలింగ్ గడువు ముగియడంతో సాయంత్రం 6గంటల్లోపు క్యూలైన్లో నిల్చున్నవారికి మాత్రమే ఓటేసేందుకు అనుమతి ఇవ్వనున్నారు.
11 గంటల పాటు కొనసాగిన GHMC పోలింగ్ ప్రక్రియ మొదట్నుంచి చివరి వరకు మందకొడిగానే సాగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఓటేసేందుకు హైదరాబాదీలు అస్సలు ఆసక్తి చూపలేదు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు కనీసం 20శాతం కూడా ఓటింగ్ కూడా దాటలేదు. మధ్యాహ్నం 3గంటల వరకు ఇదే పరిస్థితి కొనసాగింది. సాయంత్రం 4గంటల తర్వాత పోలింగ్ పర్సంటేజ్ 25శాతం మాత్రమే దాటింది. ఇక, సాయంత్రం 5గంటల తర్వాతే ఓటింగ్ 30శాతం పైగా నమోదైంది.
గ్రేటర్ హైదరాబాద్ ఓటర్లు ఓటేసేందుకు ఇంటి గేటు కూడా దాటలేదు. సగానికి పైగా ఓటర్లు కనీసం పోలింగ్ కేంద్రాల వైపు కన్నెత్తి కూడా చూడలేదు. దాంతో, GHMC ఎన్నికల పోలింగ్ ఎన్నడూలేనివిధంగా అత్యంత మందకొడిగా సాగింది. ముఖ్యంగా కార్పొరేట్ ఉద్యోగులు, విద్యాధికులే ఓటేసేందుకు ముందుకు రాలేదని అంటున్నారు. సామాన్యుల్లో కనిపించిన చైతన్యం విద్యాధికుల్లో లేకుండా పోయింది. దాంతో, సగానికి పైగా డివిజన్లలో మరీ దారుణంగా ఓటింగ్ పర్సంటేజ్ నమోదైంది.