Gangster Nayeem Case : నయీం కేసులో ఊహించని పరిణామం

Update: 2020-10-03 11:16 GMT

Gangster Nayeem Case : గ్యాంగ్ స్టర్ నయీం ఇతను నాలుగేళ్ల క్రితం పోలీసుల ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈ కేసులో ఎన్నో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు అదే కోణంలో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. నయీం ఎన్‌కౌంటర్‌ తరువాత వెలుగులోకి వచ్చిన ఉదంతాలపై విచారణ చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) కీలక నిర్ణయం తీసుకుంది. నయీం కేసులో నిందితులుగా ఉన్న 25 మంది పోలీసు ఉన్నతాధికారులకు క్లీన్ చిట్ వచ్చింది. ఈ 25 మంది కూడా నయీంతో సంబంధాలు ఉన్నాయని ల్యాండ్‌ సెటిల్‌మెంట్, బెదిరింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారే కావడం గమనార్హం. అయితే ఈ అధికారులపై వచ్చిన ఆరోపణల్లో ఎలాంటి సాక్ష్యాధారాలు లభించక పోవడంతో సిట్ అధికారులు విచారణ జరిపి సదరు పోలీసు అధికారులందరికీ క్లీన్ చిట్ ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ మేరకు పోలీసు అధికారుల పాత్రపై ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్‌ రాసిన లేఖకు సిట్ చీఫ్ నాగిరెడ్డి శనివారం సమాధానమిచ్చారు.

గ్యాంగ్ స్టార్ నయీం ఎన్‌కౌంటర్‌ తరువాత సిట్‌ 175కుపైగా చార్జ్‌సీట్‌లను దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే వారిలో 130కి పైగా కేసుల్లో పోలీసులతో పాటు 8మంది రాజకీయ నాయకుల పేర్లను చేర్చారు. అంతే కాకుండా వారిలో ఇద్దరూ అడిషనల్ ఎస్పీలతోపాటు ఏడుగురు డీఎస్పీలు, 13 మంది సీఐలు, హెడ్ కానిస్టేబుల్ వరకు అందరికీ సిట్ క్లీన్ చిట్ ఇచ్చినట్టు సిట్‌ చీఫ్‌ నాగిరెడ్డి వెల్లడించారు. ఇదిలా ఉంటే ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి పద్మనాభరెడ్డి గ్యాంగ్ స్టర్ నయీమ్ కేసును సీబీఐకి అప్పగించాలంటూ గవర్నర్‌కు లేఖ రాశారు. నయీమ్ ఇంట్లో దొరికిన డైరీలో ఉన్న వివరాలను ఇప్పటివరకు ఇవ్వలేదని ఆరోపించింది. నేరస్తులకు శిక్ష పడడాలంటే ఈ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్‌ ప్రతినిధులు కోరారు. నయీం కేసులో పోలీసుల పేర్లను తొలగించడంపై ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అభ్యంతరం వ్యక్తం చేసింది.

Tags:    

Similar News