Gangavva: 60ఏళ్ల వయసులో మహిళా లోకానికి ఆదర్శంగా నిలిచిన గంగవ్వ

Gangavva: ఆరు పదుల వయసులోనూ పదహారేళ్ళ పడుచులా చురుకుగా ఉంటూ యువతరానికి ఆదర్శంగా నిలుస్తున్న గంగవ్వ

Update: 2021-03-08 10:14 GMT

60ఏళ్ల వయసులో మహిళా లోకానికి ఆదర్శంగా నిలిచిన గంగవ్వ

మహిళలు ఇప్పుడు మగవారితో సమానం కాదు... అంత కంటే ఎక్కువే... ఎందుకంటే, నేల నుంచి అంతరిక్షం వరకు అన్నింట్లో ఒక అడుగు ముందుకే వేసింది మహిళా లోకం. వయసుతో సంబంధం లేకుండా మహిళామణులు ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నారు. సాధించి చూపిస్తున్నారు. అలాంటి ఓ మహిళపై hmtv ప్రత్యేక కథనం.

గంగవ్వ తెలుగు ప్రజలకు అస్సలు పరిచయం అక్కర్లేని పేరు మహిళా లోకానికి ఎంతో ఆదర్శం ఈ గంగవ్వ. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఓ మారుమూల పల్లెలో పుట్టి అలాంటి ఓ పల్లెకే కోడలిగా వెళ్లింది. ఊహ తెలియనప్పుడే పెళ్లి యాభై ఏళ్లుగా పుట్టిన ఊరు మెట్టిన ఊరు తప్ప మరో ప్రాంతం ఎరుగని అతి సామాన్యురాలు. ఒక్క ముక్కలో చెప్పాలంటే మన ఊళ్లో ఓ అవ్వ కథలాంటిదే ఈ గంగవ్వ కథ.

కుటుంబ కష్టాలు పిల్లలని పెంచడం ఆర్దిక భారాలు వీటితోనే గంగవ్వ 55ఏళ్ల జీవితం పల్లెలోనే గడిచిపోయింది. మగమహారాజుల ఆధిపత్యాన్ని తట్టుకుని ఇప్పుడు దూసుకుపోతున్న మహిళల గురించి ఆమెకి అస్సలు తెలియదు. అలాంటి పరిస్థితుల్లో గంగవ్వకి వచ్చిన ఓ అవకాశం తనకి తెలియకుండానే తనలోని సత్తాని బయటపెట్టింది. అంతేకాదు, జీవితంలో వచ్చే విజయాలకు వయసుతో సంబంధంలేదనే మాటని ప్రాక్టికల్‌గా చూపించింది గంగవ్వ. కేవలం తన ప్రతిభతో సెలబ్రిటీ స్థాయిని తెచ్చుకోగలిగింది ఈ 60ఏళ్ల గంగవ్వ. అంతేకాదు, సాధించాలన్న కసి ఉంటే చాలు లేటు వయసులో సైతం ప్రతి మహిళా ఏదైనా సాధించొచ్చని నిరూపించింది.

ఇలాంటి గంగవ్వలు తెలంగాణలోని ప్రతి గ్రామంలోనూ ఉన్నారు. ప్రతి వాడలోనూ కనిపిస్తారు కాని జీవితమంతా వంటింటి కందేళ్లుగా నలిగిపోతూనే ఉన్నారు. తమ పిల్లల కోసం ఇంటి వారి కోసం జీవితాన్ని ధారబోస్తునే ఉన్నారు. ఎన్నో అద్భుత నైపుణ్యాలున్నా కూడా పరిస్థితుల కారణంగా వంటింటికే పరిమితం అవుతున్నాయి. అయితే, ఇప్పుడున్న సోషల్ మీడియా మహిళా సత్తా చాటుకునేందుకు ఎన్నో అవకాశాలు కల్పిస్తోంది. ఇప్పుడున్న సమాజం కూడా రెడ్ కార్పెట్ పరుస్తోంది. సో ఇప్పుడైనా మీ నైపుణ్యాలకు పదును పెట్టండి. మీరేంటో ప్రపంచానికి పరిచయం చేసుకోండి. గంగవ్వలా మీరు కూడా మహిళా లోకానికి ఆదర్శంగా నిలవండి.

Tags:    

Similar News