జీహెచ్‌ఎంసీ ఆఫీస్‌లో సరికొత్త చరిత్ర

Update: 2021-02-22 15:27 GMT

జీహెచ్‌ఎంసీ ఆఫీస్‌లో సరికొత్త చరిత్ర

జీహెచ్‌ఎంసీ ఆఫీస్‌లో సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పదవుల్లో ఒకేసారి ఇద్దరు మహిళలు ఆశీనులవ్వడం ఇదే తొలిసారి. సర్వమత పూజల అనంతరం మహిళా నేతలిద్దరు పదవీ బాధ్యతలు చేపట్టారు. విశ్వనగరంగా ముస్తాబవుతున్న హైదరాబాద్‌ అభివృద్ధిలో తమ పాత్ర కీలకమని నూతన మేయర్, డిప్యూటీ మేయర్‌ ప్రకటించారు.

గ్రేటర్ హైదరాబాద్ మేయర్‌గా గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌గా మోతె శ్రీలత పదవీ బాధ్యతలు చేపట్టారు. జీహెచ్ఎంసీ ఆఫీసులోని 7వ అంతస్తులో మేయర్ చాంబర్‌లో సర్వమత ప్రార్థనల అనంతరం మేయర్ గా గద్వాల్ విజయలక్ష్మి ఛార్జ్ తీసుకొని ఫెయిల్‌పై తొలి సంతకం చేశారు.

ఇక డిప్యూటీ మేయర్ చాంబర్‌లో సర్వమత ప్రార్థనల అనంతరం మోతె శ్రీలత బాధ్యతలు స్వీకరించారు. జీహెచ్‌ఎంసీ ఆఫీసుకు ఎవరైనా వచ్చి, తమ సమస్యలను విన్నవించుకోవచ్చని డిప్యూటీ మేయర్‌ శ్రీలత అన్నారు. ప్రజా సమస్యలను పెద్దల సూచనలు సలహాలతో పరిష్కరిస్తామన్నారు.

మేయర్‌ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతను మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, ఎంపీ కె. కేశవరావు, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేటి విద్యాసాగర్, ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు, ఎమ్మెల్యే దానం నాగేందర్ అభినందించారు. అనంతరం కార్పొరేటర్లు, వివిధ శాఖ అధికారులు మేయర్‌, డిప్యూటీ మేయర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

150 స్థానాలు ఉన్న జీహెచ్‌ఎంసీలో ఈసారి ప్రతిపక్ష పార్టీల కార్పొరేటర్లు కూడా ఎక్కువగానే ఉన్నారు. కౌన్సిల్ సమావేశంలో చాలా గందరగోళం జరిగే అవకాశాలున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News