Vikarabad: ప్రభుత్వ ఉద్యోగం పేరుతో మోసం.. భార్యాభర్తలిద్దరికీ ఉద్యోగం ఉందని రూ.2.5 లక్షల వసూలు

Vikarabad: నకిలీ అపాయింట్‌మెంట్‌తో మోసపోయిన వాణిరెడ్డి దంపతులు

Update: 2023-08-03 02:46 GMT

Vikarabad: ప్రభుత్వ ఉద్యోగం పేరుతో మోసం.. భార్యాభర్తలిద్దరికీ ఉద్యోగం ఉందని రూ.2.5 లక్షల వసూలు

Vikarabad: ప్రభుత్వ ఉద్యోగం అని నమ్మబలికి మోసం చేసిన ఘటన వికారాబాద్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన శిరీష అలియాస్ అనూష డబ్బుల కోసం దంపతులకు ఎర వేశారు. రెండున్నర లక్షలు డిమాండ్ చేసింది. ఇదిగో ఆర్డర్ కాపీ అంటూ నకిలీ అపాయింట్‌మెంట్ ఆర్డర్ కూడా ఇచ్చేసింది. వికారాబాద్ తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లి ఆర్డర్ కాపీ చూపించడంతో శిరీష మోసాలు వెలుగులోకి వచ్చాయి.

వికారాబాద్ ఎమ్మార్వో కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇప్పిస్తానని హైదరాబాద్‌కు చెందిన వాణి దంపతులకు శిరీష నమ్మబలికింది. వారి దగ్గర నుంచి 2 లక్షల 50 వేల రూపాయలు వసూలు చేసింది. వికారాబాద్ జిల్లా కలెక్టర్, ఇతర అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి..ఓ నకిలీ ఆర్డర్ కాపీ కూడా సిద్ధం చేసింది. తహశీల్దార్ కార్యాలయలో ఉద్యోగం ఉందని ఆర్డర్ కాపీలను తీసుకెళ్లిన బాధితులు అధికారుల సమాధానంతో ఖంగుతిన్నారు. హైదరాబాద్ మౌలాలికి చెందిన వాణిరెడ్డి, ఆమె భర్త క్రిష్ణారెడ్డికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని ఆదిలాబాద్ జిల్లాకు చెందిన శిరీష అలియాస్ అనూష బోల్తా కొట్టించి అందినంత దోచుకుంది.

2 సంవత్సరాల క్రితం శిరీష ఉపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చిన శిరీష మోసాలను అలవాటుగా మార్చుకుంది. పరిచయం పెంచుకున్న అమ్మాయిలు, అబ్బాయిలను పలుమార్లు మోసాలు చేసింది. సిద్దార్థ అనే అబ్బాయితో పరిచయం పెంచుకుని, తాను జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగం చేస్తున్నానని నమ్మబలికి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఆమె మోసగించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. వాణి దంపతులను బురిడీ కొట్టించిన ఉదంతంతో శిరీష బాగోతం బయటపడటంతో.. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News