Weather Report: తెలంగాణలో మరో నాలుగు రోజులు వర్షాలు
Weather Report: మంచిర్యాల, ములుగు, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి,.. మెదక్ తదితర జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ
Weather Report: తెలంగాణను వర్షం ముంచెత్తింది. ఉపరితల ఆవర్తన ప్రబావంతో ఒక్కసారిగా వాతవరణం మారింది. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు కురిసాయి. హైదరాబాద్ సిటీతో పాటు కరీంనగర్, ఆదిలాబాద్, మంచిర్యాల వరంగల్, కామారెడ్డి, సిద్దిపేట, మెదక్, నల్గొండ, ఖమ్మం తదితర జిల్లాల్లో ఒక్కసారిగా విరుచుకుపడిన వాన రైతులను, సామాన్యులను ఆగం చేసింది. ఉరుములు, మెరుపులతో ఈదురు గాలులు వీచాయి. ఒక్కసారిగా దంచికొట్టిన వానతో ధాన్యం కుప్పలన్నీ కొట్టుకుపోయాయి. కళ్లెదుటే ధాన్యం కొట్టుకుపోవడం చూసి రైతుల కళ్లల్లో కన్నీళ్లు వరదలై పారాయి. రైతులకు తీరని నష్టం వాటిల్లింది.
రానున్న నాలుగు రోజుల పాటు కోస్తాంధ్ర, యానాం, తెలంగాణ, రాయలసీమలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ముఖ్యంగా కోస్తాంధ్ర, తెలంగాణ, రాయలసీమలో అక్కడక్కడా భారీ వర్షాలు పడతాయని ఐఎండీ పేర్కొంది. ఇక ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు బాగా తగ్గే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
ఉపరితలం ఆవర్తనం కారణంగా తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. మధ్యప్రదేశ్‌లోని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 0.9 కిలోమీటరల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణశాఖ తెలిపింది. ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురవనున్నట్లు తెలిపింది. ఇటు హైదరాబాద్‌లోనూ భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందని.. సాయంత్రం తర్వాత కూడా కురిసే అవకాశం ఉండడంతో ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
నైరుతి రుతుపవనాల రాకముందే రాష్ట్రంలో భారీ వర్షం కురిసింది. హైదరాబాద్ పరిధిలో భారీ నుంచి అతి భారీ వర్షం కురవగా పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తర వర్షాలు కురిశాయి. భారీ వర్షానికి గ్రేటర్ హైదరాబాద్ అతలాకుతలం అయ్యింది. జనజీవనం స్తంభించింది. రాజధాని శివారు ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనాల రాకపోకలు గంటల తరబడి నిలిచిపోయాయి. నాలాలు పొంగి ప్రవహించాయి.
గచ్చిబౌలి, కూకట్ పల్లి, నిజాంపేట్ , హైదర్ నగర్ , బాచుపల్లి, బోయిన్ పల్లి, మారేడుపల్లి, బేగంపేట్ , ప్యారడైజ్ , చిలకలగూడ, అల్వాల్ , జవహర్ నగర్ , మల్కాజిగిరి, నేరేడ్ మెట్ , నాగారం, కుత్బుల్లాపూర్ , చింతల్ , షాపూర్ నగర్ , గాజులరామారం, సూరారం, బహదూర్ పల్లి, షేక్ పేట, రాయదుర్గం, పంజాగుట్ట, బోరబండ, రెహమత్ నగర్ , ఉప్పల్ తదితర ప్రాంతాల్లో వరద ఏరులై పారింది. మలక్ పేట మెట్రో స్టేషన్ సమీపంలో రోడ్లపై నిలిపిన ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 14 మండలాల్లో 6.7 నుంచి తొమ్మది సెంటి మీటర్ల మధ్య వర్షపాతం నమోదు అయ్యింది. ఖైరతాబాద్ లో 9 సెంటి మీటర్లు, షేక్ పేటలో 8.7 సెంటిమీటర్లు వర్షం కురిసింది.