ప్రాణంతీసిన పోడు సమస్య.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోడు భూముల గొడవ
*ఖమ్మం జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి.. ఎఫ్ఆర్వో శ్రీనివాసరావు మృతిపట్ల సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి
Forest Officer Murder: తెలంగాణలో పోడుభూముల సమస్య అటవీ శాఖాధికారిని పొట్టన బెట్టుకుంది. గత కొంతకాలంగా పోడుభూముల వ్యవహారం అలజడి రేపుతోంది. అటవీ స్థావరాలను చదునుచేసుకుని పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులకు, పోడు వ్యవసాయాన్ని అడ్డుకుంటున్న అటవీశాఖ అధికారులకు తరచూ వాదోపవాదాలు, ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంటోంది. తాజాగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పోడు భూముల గొడవలో ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీనివాసరావు హత్యకు దారితీసింది. నిన్న మొన్నటిదాకా భౌతిక దాడులకు పాల్పడే గిరిజనులు తాజాగా హత్యకు దారితీయడంతో ఈ ఉదంతం తెలంగాణలో సంచలనం రేకెత్తించింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోడు భూముల సమస్య రగులుతూనే ఉంది. చంద్రుగొండ మండలం బెండాలపాడు అటవీ ప్రాంతం ఎర్రబోడు సమీపంలో అటవీశాఖ అధికారులు నాటిన మొక్కలు తొలగించేందుకు పోడుభూముల సాగుదారులు యత్నించారు. వారిని అడ్డుకోవడానికి వెళ్లిన ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీనివాసరావు, బెండాలపాడు అటవీశాఖ సెక్షన్ అధికారి రామారావుపై మూకుమ్మడిగా దాడికి యత్నించారు. నాటిన మొక్కల్ని తొలగించవద్దని వారించేలోపే మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు.
బెండాలపాడు అటవీశాఖ సెక్షన్ అధికారి రామారావు అక్కడి నుంచి తప్పించుకోగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావుపై కత్తులు, గొడ్డళ్లతో విరుచుకుపడ్డారు. ఈ దాడిలో శ్రీనివాసరావు తీవ్రంగా గాయపడ్డారు. మెడ భాగంలో బలమైన గాయాలై తీవ్ర రక్తస్రావం కావటంతో వెంటనే ఆయన్ను చంద్రుగొండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడనుంచి అంబులెన్స్‌లో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో తనువుచాలించారు.
విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా చురుకు దనంతో పనిచేసే శ్రీనివాసరావు గుత్తికోయ గిరిజనుల దాడిలో అసువులు బాసిన విషయం తెలుసుకున్న అధికారులు, సహచరులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి ఆయన గతంలో పలుసార్లు ప్రభుత్వం నుంచి అవార్డులు కూడా అందుకున్నారు.
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచి వలస వచ్చిన కొంత మంది గుత్తికోయలు కొత్తగూడెం జిల్లా చండ్రగొండ మండలం బెండాలపాడు పంచాయతీ ఎర్రబోడులో అవాసం ఏర్పాటు చేసుకున్నారు. పోడు వ్యవసాయం ఆధారంగా జీవనం సాగిస్తున్నారు. పోడు భూముల సర్వే కోసం బెండాలపాడు పంచాయతీ కొన్ని రోజుల కిందట తీర్మానం చేసింది. ఎర్రబోడులో కొంత మంది గిరిజనులు ప్లాంటేషన్ మొక్కలను ధ్వంసం చేసి పోడుకు సిద్ధమైనట్లు ఫారెస్టు అధికారులకు సమాచారం అందింది. ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు, ఇద్దరు సిబ్బందిని వెంటబెట్టుకొని ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈనేపథ్యంలో గుత్తికోయలకు, ఫారెస్ట్ సిబ్బందికి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు ప్రాణాలమీదికొచ్చింది. ఈ దాడి ఘటనను పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ఘటనపై అటవీ శాఖ ఉన్నతాధికారులు అరా తీశారు. పోలీసులు విచారణ చేపట్టారు. ప్రత్యక్ష సాక్షుల నుంచి ప్రాథమిక సమాచారం సేకరించారు. నిందితులను గుర్తించినట్లు తెలుస్తోంది.
గుత్తికోయల దాడిలో ఎఫ్‌ఆర్‌వో శ్రీనివాసరావు మృతి పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శ్రీనివాసరావు కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. దోషులకు కఠిన శిక్షలు పడేలా చూడాలని డీజీపీ మహేందర్ రెడ్డిని ఆదేశించారు. ఎఫ్‌ఆర్‌వో కుటుంబానికి రూ.50 లక్షలు పరిహారాన్ని సీఎం ప్రకటించారు. శ్రీనివాసరావుకు పదవీ విరమణ వయసు వచ్చే వరకు ఆయన భార్యకు పూర్తి వేతనం ఇవ్వాలని .. కుటుంబ సభ్యుల్లో అర్హులకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కేసీఆర్ ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ లాంఛనాలతో శ్రీనివాసరావు అంత్యక్రియలు నిర్వహించాలని.. అంత్యక్రియల్లో పాల్గొనాలని మంత్రులు పువ్వాడ అజయ్, ఇంద్రకరణ్ రెడ్డిలను సీఎం ఆదేశించారు.
గుత్తికోయల దాడిలో రేంజర్ శ్రీనివాసరావు మరణించడం పట్ల అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పోడు భూముల సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంటే.. విధి నిర్వహణలో ఉన్న అధికారులపై దాడులు చేయడం సరికాదని పేర్కొన్నారు. అటవీ భూముల ఆక్రమణలు సహించేది లేదన్న మంత్రి.. ఆక్రమణదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అటవీ అధికారులు మనోస్థైర్యం కోల్పోవద్దన్న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఇలాంటి ఘటనలు భవిష్యత్‌లో చోటు చేసుకోకుండా చూస్తామని తెలిపారు.