ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ప్రభుత్వం తరుపున అందాల్సిన నష్టపరిహారం అందడం లేదని, హైదరాబాద్ వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. అసలైన బాధితులకు సాయం అందించకుండా మధ్యవర్తులే దోచుకుంటున్నారని ఆందోళన చేపట్టారు. దాంతో నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రజాప్రతినిధుల ఇళ్లను ముట్టడికి ప్రయత్నించారు. రాస్తారోకోలు చేశారు.
హైదరాబాద్ అంబర్‌పేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ఇంటిని వరద బాధితులు ముట్టడించారు. ఇదే సమయంలో బాధితులకు ఇచ్చే నష్టపరిహారం తనకు అందలేదని పెట్రోల్ పోసుకుని ఒక వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. దాంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది. అసలైన బాధితులకు నష్టపరిహారం అందించకుండా.. మధ్యవర్తులకు అందుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు రాజకీయ నాయకులు తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
ఇటు వరద బాధితులు నష్టపరిహారం అందలేదని సికింద్రాబాద్ GHMC కార్యాలయ ముందు ధర్నా చేపట్టారు. తమకు నష్టపరిహారం అందలేదని పెద్ద ఎత్తున బాధితులు ఆందోళన చేపట్టారు. ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బాధితుల ఇంటివద్దకు అధికారులు వచ్చి చూసి ఆధార్ నెంబర్ తీసుకుని ఓటీపీ వచ్చిన తర్వాత అధికారులు బేరసారాలు ఆడుతున్నారని బాధితులు చెబుతున్నారు.
వరద సహాయం అందలేదని మనస్తాపంతో ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన జూబ్లిహిల్స్‌లో చోటు చేసుకుంది. ఉదయ్‌నగర్‌లో నివాముండే బిక్షపతి రిక్షాలో చెత్త సేకరిస్తుంటాడు. అయితే ఆయన ఇటీవల కూతురు పెళ్లి చేశాడు. వదరల్లో ఇళ్లు నిండా మునిగింది. దాంతో ప్రభుత్వం నుంచి వరద సహాయం వస్తుందని ఆశగా ఎదురు చూశాడు. అయితే అధికారులు నిరాకరించడంతో మనస్థాపానికి గురై గుండెపోటుతో మృతి చెందాడు.