Warangal: కారు పార్టీలో రచ్చకెక్కిన లొల్లి.. కవిత మహబూబాబాద్ టికెట్ ఆశిస్తున్నారా?
Warangal: దసరా వేదికగా ఓరుగల్లు అధికార పార్టీలో వర్గపోరు రచ్చకెక్కింది.
Warangal: దసరా వేదికగా ఓరుగల్లు అధికార పార్టీలో వర్గపోరు రచ్చకెక్కింది. మానుకోటలో ఫ్లెక్సీల వివాదం చిలికిచిలికి గాలివానగా మారింది. ఉర్సు రంగలీలా మైదానం వేదికగా తూర్పు నియోజకవర్గ పెద్దల మధ్య అభిప్రాయభేదాలు కొట్టొచ్చినట్లు కనిపించాయి. ఉమ్మడి జిల్లాలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల మధ్య గొడవలు ముదిరాయి. వచ్చే నెలలో వరంగల్‌లో పార్టీ ద్విదశాబ్ధి ఉత్సవ సభ నిర్వహించనున్న వేళ జిల్లా నేతల మధ్య కొరవడిన సమన్వయం సభా నిర్వహణకు సమస్యగా మారుతుందా? వరంగల్ టీఆర్ఎస్‌లో ఏం జరుగుతోంది.?
ఓరుగల్లు టీఆర్ఎస్‌లో వర్గపోరు తారాస్థాయికి చేరింది. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల మధ్య గ్రూప్‌వార్ ఆ పార్టీ కార్యకర్తలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. ముఖ్యంగా దసరా వేదికగా మానుకోట, వరంగల్ తూర్పు నియోజకవర్గాల్లో జరిగిన ఘటనలు గులాబీ దండులో లుకలుకలను బయటపెట్టేలా ఉన్నాయి. మహబూబాబాద్‌లో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే గొడవ పోలీస్‌స్టేషన్ వరకు చేరగా తూర్పులో మేయర్ వర్సెస్ ఎమ్మెల్యే వ్యవహారం చర్చనీయాంశమైంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నేతల ఆధిపత్య పోరు మొదటి నుంచి పార్టీని నమ్ముకుని ఉన్న వారికి ఇబ్బందిగా మారింది.
సద్దుల బతుకమ్మ వేడుకల సాక్షిగా మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్, ఎంపీ కవితల మధ్య ఆధిపత్యపోరు తారాస్థాయికి చేరింది. ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు ఒకరు, నిలువరించేందుకు మరొకరు ఇలా ఇరువర్గాల మధ్య హైవోల్టేజీ పాలిటిక్స్ రన్ అవుతున్నాయి. సద్దుల బతుకమ్మ వేడుకల సందర్భంగా మానుకోటలో ఎంపీ కవిత వర్గీయులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఎమ్మెల్యే శంకర్ నాయక్ అనుచరులు చించేశారు. దీనిపై కవిత అనుచరులు పోలీసులకు ఫిర్యాదు చేయడం, మున్సిపల్ వైస్ చైర్మన్‌తో సహా పలువురిపై కేసులు పెట్టడం అర్ధరాత్రి హైడ్రామా సాగింది. శంకర్‌నాయక్ పీఎస్ ముందు హంగామా చేసి, సమస్య తీవ్రతను ఎస్టాబ్లిష్ చేశారు. మానుకోటలో జరిగిన ఘటనపై ఎంపీ కవిత, మంత్రి కేటీఆర్‌కు ఫిర్యాదు చేశారు. వర్గపోరు సహజమే అయినా పోలీస్‌స్టేషన్ వరకు పంచాయతీ చేరిందంటే పరిస్థితి ఎంతగా విషమించిందో అర్ధం చేసుకోవచ్చని, ఈ విషయంలో ఇద్దరు నేతలను అధిష్టానం తీవ్రంగా మందలించిందట.
ఇక, వరంగల్ తూర్పు ప్రత్యక్ష పోరు కంటే పరోక్ష పోరే ఎక్కువగా ఉంది. ఇక్కడ జరుగుతున్న రాజకీయంపై ప్రజల్లో హాటాట్‌గా చర్చ జరుగుతోంది. తూర్పులో దసరా సందర్భంగా జరిగిన రావణవధ కార్యక్రమంలో ఎమ్మెల్యే నరేందర్ అంతా తానే అయి వ్యవహరించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మంత్రి ఎర్రబెల్లితో మాట్లాడించిన తర్వాత మరోనేతతో మాట్లాడించకపోవడంతో స్టేజిపై ఉన్న ప్రజాప్రతినిధులంతా అసంతృప్తిగా ఫీలయ్యారు. అయితే స్టేజీ మీద మేయర్ గుండు సుధారాణి కూడా ఉండడం తన నియోజకవర్గంలో ఆమె ఆధిపత్యానికి అవకాశం ఇవ్వకుండా నరేందర్ వ్యూహాత్మకంగా వ్యవహరించారని విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా రెండు, మూడు గంటల పాటు సందడిగా జరగాల్సిన వేడుక కేవలం 15 నిముషాల్లో ముగించారంటే రాజకీయం ఎంత రసవత్తరంగా మారిందో అర్ధం చేసుకోవచ్చు.
తూర్పులో గత ఆరు నెలలుగా మేయర్ వర్సెస్ ఎమ్మెల్యే కోల్డ్‌వార్ నడుస్తోంది. మేయర్‌కు అవకాశమీయకుండా ఆమె కూడా ఎమ్మెల్యే అనుచరులైన కార్పొరేటర్లకు ప్రయార్టీ ఇవ్వకుండా ఒకరికొకరు వ్యక్తిగత ద్వేషాలతో పైకి నవ్వుకుంటూనే కనిపించినా అంతర్గతపోరుతో కార్పొరేటర్లు ఇబ్బందులు పడుతున్నారు. ఉర్సు వేడుకలో చాలామంది ప్రజాప్రతినిధులు వచ్చినా ఎవరినీ మాట్లాడించకుండా ఎర్రబెల్లితో మాత్రమే మాట్లాడించి ప్రోగ్రామ్ అయిపోయిందనిపించారు తూర్పు ఎమ్మెల్యే దీంతో వరంగల్ మేయర్ వర్గం భగ్గుమంటోంది. కార్పొరేషన్ నుంచి అవసరమైన సహకారం తీసుకుంటారు కానీ ఆమెకు ప్రాధాన్యత కల్పించకపోవడమేంటంటూ ప్రశ్నిస్తున్నారు.
అటు, మానుకోటలో ఇటు తూర్పులో గతం నుంచి నేతల మధ్య గొడవలు ఉన్నాయి. ముఖ్యంగా మానుకోటలో 2014లో శంకర్‌నాయక్, కవితల మధ్య పోటీ జరిగింది. ఈ ఎన్నికల్లో శంకర్ నాయక్ గెలుపొందారు. ఆ తర్వాత కవిత అధికార పార్టీలో చేరి మానుకోట ఎంపీగా విజయం సాధించారు. తాజాగా మహబూబాబాద్ ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తూ శంకర్‌నాయక్‌ను దెబ్బకొట్టాలని చూస్తుందంటూ ఎమ్మెల్యే అనుచరులు అంటుంటే కవిత వర్గీయులు మాత్రం ఆమెకు ఆ ఆలోచనే లేదంటూనే మానుకోటలో ఆధిపత్యాన్ని ప్రదర్శించేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటు తూర్పులో గతంలో టీడీపీలో కలిసి పనిచేసిన ఎమ్మెల్యే నరేందర్, మేయర్ గుండు సుధారాణిల మధ్య సఖ్యత ఉండేది. కానీ సుధారాణి మేయర్ అయిన తర్వాత నరేందర్ ఆమెకు సహకరించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. మేయర్ కూడా నరేందర్ అనుచరులైన కొంతమంది కార్పొరేటర్ల డివిజన్లలో వారికి సమాచారమివ్వకుండానే పర్యటిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.
ఏదేమైనా ఉమ్మడి వరంగల్ జిల్లా నేతల ఆధిపత్య పోరుతో అటు కార్యకర్తలు, ఇటు అధికారులు నలిగిపోతున్నారన్నది వాస్తవం. ముఖ్యంగా వచ్చేనెల 15న వరంగల్ లో టీఆర్ఎస్ ద్విదశాబ్ధి సభ ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి కేసీఆర్ ప్రకటించిన వేళ ఈ వర్గపోరు సభ సక్సెస్‌పై ప్రభావం చూపుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి, గులాబీ దళపతి వరంగల్ జిల్లానేతలతో మాట్లాడి ఈ గ్రూప్ వార్ విషయంలో సీరియస్ వార్నింగ్ ఇవ్వబోతారని తెలుస్తోంది. కేసీఆర్ వార్నింగ్‌తోనైనా ఓరుగల్లు నేతలు సెట్‌రైట్ అవుతారా లేక పాత పద్ధతిలోనే గ్రూప్ వార్ కొనసాగిస్తారా అన్నది చూడాలి.