తిమ్మాపూర్‌ వాగులో కొట్టుకుపోయిన కారు.. నవ వధువు సహా నలుగురి గల్లంతు

* ప్రాణాలతో బయటపడిన భర్త, ఆడపడుచు

Update: 2021-08-30 02:57 GMT

 వాగులో కొట్టుకుపోయిన కారు (ఫైల్ ఫోటో) 

Vikarabad: వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం తిమ్మాపూర్‌ వాగులో నిన్న ప్రమాదవశాత్తు కారు కొట్టుకుపోయింది. మోమిన్‌పేట నుంచి రావులపల్లి వెళ్తుండగా ప్రమాదవశాత్తు కారు ప్రవాహంలో కొట్టుకుపోగా ఐదుగురు గల్లంతయ్యారు. ఇందులో నవ వధూవరులు నవాజ్‌రెడ్డి, ప్రవళిక, వరుడి అక్కలు శ్వేత, రాధమ్మ, కారు డ్రైవర్‌తో పాటు మరో బాలుడు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ నెల 26న రావులపల్లికి చెందిన నవాజ్‌రెడ్డికి మోమిన్‌పేటకు చెందిన ప్రవళికతో వివాహం జరిగింది.

ఆదివారం మోమిన్‌పేటకు వెళ్లి వస్తుండగా తిమ్మాపూర్ వాగులో కారు కొట్టుకుపోయింది. రోడ్డుపై నుంచి నీరు పారుతుండగా వద్దని వారించినా వినకుండా వాగు దాటుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు చెబుతున్నారు. పోలీసు, రెవెన్యూ సహాయక సిబ్బంది గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అయితే వరుడు నవాజ్ రెడ్డి అతని అక్క క్షేమంగా బయటపడ్డారు.

భారీ వర్షాల నేపథ్యంలో వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయవద్దని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రజలను అప్రమత్తం చేశారు. ఆదివారం భారీ వర్షాల వల్ల వికారాబాద్ జిల్లాతో పాటు చేవెళ్ల నియోజకవర్గం పరిధిలోని పలు వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ఎలాంటి సంఘటనలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. మర్పల్లి వాగులో గల్లంతైన వారి ఆచూకి కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చేపట్టాలని పోలీసులను ఆదేశించారు.

Tags:    

Similar News