Job Vacancies: తెలంగాణలో ఉద్యోగ ఖాళీలపై ఆర్థికశాఖ కసరత్తు
Job Vacancies: ఇవాళ అన్ని శాఖలతో ముఖ్య కార్యదర్శి కీలక భేటీ
Job Vacancies: తెలంగాణలో ఉద్యోగ ఖాళీలపై ఆర్థికశాఖ కసరత్తు షురూ చేసింది. 50వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పూర్తిస్థాయిలో ఖాళీల గుర్తింపునకు ఆర్థికశాఖ కసరత్తు చేపట్టింది. ఈరోజు ఉదయం ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన, ముఖ్య కార్యదర్శులు, అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. భర్తీ కావాల్సిన ఖాళీలపై ప్రభుత్వం గత ఏప్రిల్‌లో మొదటి దఫా వివరాలు సేకరించింది. తాజాగా జోనల్ వ్యవస్థ నేపథ్యంలో ఆయా శాఖల్లో, వాటి పరిధి ప్రభుత్వ రంగ సంస్థల్లోని ఖాళీల వివరాలు సేకరించాలని నిర్ణయించింది. ఇవాళ జరిగే సమావేశంలో పశుసంవర్ధక, పౌరసరఫరాలు, అటవీ, నీటిపారుదల, కార్మిక, హోం, న్యాయ, శాసనసభ, పురపాలక, పర్యాటక తదితర శాఖల అధికారులతో సమావేశమై శాఖాపరమైన ఖాళీలతో పాటు జిల్లాలు, జోన్‌లు, బహుళ జోన్ల వారీగా వివరాలు తీసుకుంటారు.
ఈ నెల 13న మంత్రిమండలిలో మొత్తం ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలియజేయనున్నారు. ఈ నేపథ్యంలో పక్కా వివరాలతో నివేదికను అందజేయాలని, దీనిని అత్యంత ప్రాధాన్యమైందిగా భావించి ముందుగా ఆయా శాఖల్లోని అధికారులంతా చర్చించి, ప్రత్యక్ష నియామకాలపై పూర్తి సమాచారం అందజేయాలని రామకృష్ణారావు సూచించారు. సమావేశంలో అందిన వివరాలతో ఈ నెల 12న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు ఆర్థికశాఖ నివేదిక సమర్పించనుంది. దానిని ఆయన సీఎం కేసీఆర్‌కు, మంత్రిమండలికి అందజేస్తారు. మొదటి దశలో భర్తీచేయనున్న ఖాళీలతో పాటు అన్ని శాఖల్లో పదోన్నతుల నిర్వహణపై సమావేశంలో చర్చిస్తారు. పదోన్నతుల అనంతరం ఖాళీ అయ్యే పోస్టుల అంచనాలను తీసుకుంటారు.