Mahbubnagar: ఎమ్మెల్సీ స్థానం కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ
Mahbubnagar: మహబూబ్‍నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు రంగం సిద్ధం
Mahbubnagar: మహబూబ్‍నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రంగం సిద్ధమైంది. గురువారం జరగనున్న ఎలక్షన్ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు అధికారులు. పోలింగ్ సజావుగా జరిగేలా కావాల్సిన చర్యలను ముమ్మరం చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న 1439 ఓటర్లకు గాను 10 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇటు పోలింగ్‌కు టైం దగ్గర పడటంతో పోటీలో ఉన్న రెండు ప్రధాన పార్టీలైన అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‍ఎస్ అభ్యర్థులు ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు పావులు కదుపుతున్నారు. క్యాంప్ రాజకీయాలతో బిజీగా ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణ రెడ్డి.. ఆ పార్టీకి, పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యం అయింది. ఎమ్మెల్సీ పోరు కాంగ్రెస్ నుంచి మన్నె జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి నవీన్ రెడ్డి బరిలో నిలిచారు. ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకొని లోక్‌సభ ఎన్నికల ముందు కేడర్‌లో జోష్ తీసుకురావాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుంటే.. కాంగ్రెస్‌కు ప్రధాన ప్రతిపక్షం తామేనేని, లోక్‌సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ను ఢీకొట్టేది కారు పార్టీనే అనే సంకేతాలు పంపేందుకు.. ఆ స్థానాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది బీఆర్ఎస్.
ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు..రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలోని స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 1,439 ఓటర్ల కూడా ఉండగా.. పోలింగ్ కేంద్రాల వారిగా వారిని విభజించారు. 10 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి, సమీపంలోని మునిసిపాలిటీలను ఆయా పోలింగ్ కేంద్రాలకు నియమించారు. మహబూబ్ నగర్ జిల్లాలో 245 మంది ఓటర్లు ఉన్నారు. వీరంతా మహబూబ్ నగర్ ఎంపీడీవో కార్యాలయంలో తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక వికారాబాద్ జిల్లా పరిధిలోని కొడంగల్, దౌల్తాబాద్, దామరగిద్ద మండలాలకు చెందిన జడ్పీ టీసీ, ఎంపీటీసీ సభ్యులు, కొడంగల్ మునిసిపాలిటీకి చెందిన కౌన్సిలర్లు మొత్తం 56 మంది ఉండగా వారు కొడంగల్ ఎంపీడీవో కార్యాలయంలో ఓటు వేయాల్సి ఉంది. ఇందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎక్స్ ఆఫీషియో సభ్యులుగా కొడంగల్ ఎంపీడీవో కార్యాలయంలో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
ఇక నారాయణపేట జిల్లాలో 205 మంది ఓటర్లు ఉండగా..వీరంతా నారాయణపేట ఎంపీడీవో కార్యాలయంలో ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. జోగులాంబ గద్వాల జిల్లాలో 225 మంది సభ్యులు ఉన్నారు. వీరికి జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని జడ్పీ మీటింగ్ హాల్ ను కేటాయించారు. వనపర్తి జిల్లాలో 218 మంది ఓటర్లు ఉండగా.... వీరికి వనపర్తి ఆర్డీవో కార్యాలయంలో పోలింగ్ బూత్ ను ఏర్పాటు చేశారు. నాగర్ కర్నూల్ జిల్లాలోని 67 మంది ఓటర్లకు.. కొల్లాపూర్ బాలిక జూనియర్ కళాశాలలో పోలింగ్ బూత్ ను ఏర్పాటు చేశారు. నాగర్ కర్నూల్ నియోజకవర్గంలోని 101 మంది ఓటర్లకు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని పైకా భవనంలో, అచ్చంపేట నియోజకవర్గంలోని 79 మంది ఓటర్లకు అచ్చంపేట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో, కల్వకుర్తికి చెందిన 72 మంది ఓటర్లకు కల్వకుర్తిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పోలింగ్ సెంటర్లను సిద్ధం చేస్తున్నారు. షాద్ నగర్ నియోజకవర్గంలో 171 మంది ఓటర్లు ఉండగా వారి కోసం షాద్ నగర్ ఎంపీడీవో కార్యాలయంలో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
ఈ నెల 28న ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ జరగనుంది. ఓటింగ్ కు మరో మూడు రోజులు మాత్రమే సమయం ఉండటంతో బరిలో ఉన్న నాయకులు ప్రచారంలో బిజీ అయ్యారు. ఎక్కడికక్కడ ఆయా పార్టీలకు చెందిన కీలక నాయకులు, జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, మునిసిపాలిటీ కౌన్సిలర్లతో మంతనాలు సాగిస్తున్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ భారీగా చేరికలపై దృష్టి పెట్టింది. ఇప్పటికే పలువురు కౌన్సిలర్లు, ఎంపీటీసీ సభ్యులు కాంగ్రెస్‌లో చేరారు. బీఆర్ఎస్ మాత్రం మెజారిటీ సభ్యుల సంఖ్యా బలం ఉన్నందున అందులో కొందరు పార్టీ మారినా మిగతా వారి మద్దతుతో గట్టెక్కుతామని లెక్కలేసుకునే పనిలో ఉంది. అయితే మాజీ ఎమ్మెల్యేలు కొన్ని చోట్ల ఎమ్మెల్సీ ఎన్నికకు దూరంగా ఉంటున్నట్లు బీఆర్ఎస్ లో గుస గుసలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ మాత్రం ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులను రంగంలోకి దింపి ఎన్నికలపై పట్టు బిగిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఓటర్లను శిబిరాలకు తరలించి, నేరుగా పోలింగ్ బూత్ లకు తీసుకువచ్చేలా రెండు పార్టీలు ప్లాన్ చేస్తున్నాయి.