ముగిసిన ఉమ్మడి రాజధాని గడువు: హైద్రాబాద్ తెలంగాణకే రాజధాని
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసే సమయంలో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 ను అప్పటి యూపీఏ ప్రభుత్వం తీసుకు వచ్చింది. ఈ చట్టంలోని సెక్షన్ 5 (1) ప్రకారంగా పదేళ్లకు మించకుండా హైద్రాబాద్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు రాజధానిగా ఉంటుంది.
హైద్రాబాద్ ఇవాళ్టి నుండి తెలంగాణకు మాత్రమే రాజధాని. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు హైద్రాబాద్ ఉమ్మడి రాజధానిగా పదేళ్లు పూర్తైంది. హైద్రాబాద్ లో ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన భవనాలను కూడా స్వాధీనం చేసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
ఏపీ పునర్విభజన చట్టం 2014లో ఏముందంటే?
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసే సమయంలో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 ను అప్పటి యూపీఏ ప్రభుత్వం తీసుకు వచ్చింది. ఈ చట్టంలోని సెక్షన్ 5 (1) ప్రకారంగా పదేళ్లకు మించకుండా హైద్రాబాద్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు రాజధానిగా ఉంటుంది. పదేళ్ల గడువు ముగిసిన తర్వాత సెక్షన్ 5 (2) ప్రకారంగా హైద్రాబాద్ తెలంగాణకు మాత్రమే రాజధానిగా ఉంటుందని ఆ చట్టం చెబుతుంది. పదేళ్ల గడువు ముగిసినందున హైద్రాబాద్ ఇవాళ్టి నుండి తెలంగాణకు మాత్రమే రాజధాని. హైద్రాబాద్ లోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్ తో పాటు పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన భవనాలను జూన్ రెండు తర్వాత స్వాధీనం చేసుకోవాలని అధికారులను గత నెలలో ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ఇంకా స్పష్టత లేదు. 2014లో చంద్రబాబునాయుడు ప్రభుత్వం అమరావతిలో రాజధానికి శంకుస్థాపన చేసింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం మూడు రాజధానుల అంశాన్ని తెరమీదికి తెచ్చింది. అమరావతి శాసనరాజధానిగా, కర్నూల్ ను న్యాయ రాజధానిగా, విశాఖపట్టణాన్ని పరిపాలనా రాజధానిగా ప్రకటించింది. 2024 అసెంబ్లీ ఎన్నికల ముందే విశాఖపట్టణం నుండి పాలనను ప్రారంభిస్తానని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. కానీ, విశాఖపట్టణానికి ఇంకా రాజధానిని తరలించలేదు. రెండు రోజుల్లో ఏపీలో అసెంబ్లీ ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఏపీలో మరోసారి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే విశాఖపట్టణం నుండి జగన్ పాలన ప్రారంభించే అవకాశాలున్నాయి. ఒకవేళ టీడీపీ అధికారం దక్కించుకొంటే అమరావతిలో రాజధాని కోసం భవనాల నిర్మాణ పనులు పున:ప్రారంభమయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.