ఆయన మాజీ మంత్రి. మాజీ ఎంపీ కూడా. లాస్ట్ ఎన్నికల్లో ఓడిపోయారు. ఇంకెందుకులే పాలిటిక్స్ అని, సైలెంటయ్యారు. ఎక్కడా కనపడలేదు. మాటా వినపడలేదు. కానీ ఇప్పుడాయన, కాలికి చక్రాలు కట్టుకుని, జిల్లా మొత్తం చక్కర్లు కొడుతున్నారట. ఎప్పుడూ పలకరించని వాళ్లను సైతం హాయ్.. హల్లో.. హౌ ఆర్ యూ.. అంటూ విష్ చేస్తున్నారట. అంతలోనే ఇంత మార్పు ఏంటని, ఆయన చుట్టూ తిరుగుతున్న అనుచరులకు కూడా అర్థంకావడం లేదట. కానీ సారు వారి, కదలికల వెనక అసలు కహాని వేరే వుందట. ఏంటది?
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఓ వెలుగు వెలిగిన నాయకుడు మాజీ మంత్రి, మాజీ ఎంపీ నగేష్. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తర్వాత, కనిపించకుండా పోయారు. కనీసం కొందరు సన్నిహితులు ఆయనను కలువడానికి ప్రయత్నించినా, అంటీముట్టనట్లుగా వ్యవహరించారట నగేష్. అయితే, 18 నెలల అజ్ణాతవాసం వీడారట ఆయన. ఇఫ్పుడు జనంలోకి వస్తూ, లీడర్లను కలుస్తున్నారట మాజీ ఎంపీ. అయితే, దీనిక వెనక అసలు కథ వేరే వుందట.
మళ్లీ రాజకీయాల్లో క్రియాశీలం కావాలని తహతహలాడుతున్నారట నగేష్. ప్రజా సమస్యలపై కలువడానికి వెళ్లిన నేతలను పట్టించుకోని మాజీ ఎంపీ, ఇప్పుడు ఏకంగా అభివృద్ది పనుల కోసం అధికారులను కలుస్తుండటం చూసి, ఆయన అనుచరులు సైతం ఆశ్చర్యపోతున్నారట. ఆదిలాబాద్ జిల్లాలో నలభై నాలుగవ జాతీయ రహదారి పనులు అసంపూర్తిగా వదిలేశారు. పెండింగ్ పనులను చేపట్టడానికి నిధులు మంజూరు చేసింది కేంద్రం. వర్క్స్ పూర్తి చెయ్యాలని, హైదరాబాద్‌లోని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా రీజినల్ ఆఫీసర్లను, కలిసి కోరారట మాజీ మంత్రి నగేష్. అదేవిధంగా, దేవాలయాలకు సంబంధించిన ఫండ్స్ విడుదలకు, మంత్రి ఇంద్రరణ్ రెడ్డిని కూడా కలిసి కోరారట.
అయితే మాజీ ఎంపీ చురుగ్గా వ్యవహరించడం వెనుక మూడు వ్యూహలు ఉన్నాయట. ఎన్నికల్లో ఓటమి తర్వాత నగేష్ రాజకీయాలకు దూరంవుతున్నారన్న ప్రచారం జరిగింది. ఆయన అంత యాక్టివ్‌గా లేకపోవడంతో, ఆ అభిప్రాయం మరింత బలపడింది. దీన్ని చెరిపేసి, తాను క్రియాశీలకంగా వున్నానని చెప్పుకునేందుకే, ఆయన తెగ తిరిగేస్తున్నారన్న మాటలు వినపడ్తున్నాయి. అందుకే మంత్రులను, అధికారులను కలవడమట. అంతేకాదు, బోథ్ నియోజకవర్గంలో ఇప్పటికీ హవా తనదేనని చెప్పుకోవడం కూడా, నగేష్ వ్యూహంలో భాగమట. నియోజకవర్గంలో తానింకా బలంగా ఉన్నానని నిరూపించుకునే ప్రయత్నమట. ఇక నగేష్ యాక్టివ్‌గా మారడం వెనక వినిపిస్తున్న మూడో స్ట్రాటజీ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి అట. ఇదే అసలైన టార్గెట్ అన్న ప్రచారమూ బలంగా జరుగుతోంది. త్వరలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ జాబితా రెడీ అవుతుంది. అందులో తన పేరూ వుండాలని తపిస్తున్నారట మాజీ ఎంపీ నగేష్. పార్టీ పెద్దలను సైతం ఇదే అడుగుతున్నారట. అందులో భాగంగానే అభివృద్ది పనుల పేరుతో, మంత్రులు, పార్టీ పెద్దలను కలుస్తూ, ఎమ్మెల్సీ అంశం ప్రస్తావిస్తున్నారట. పైకి ఏవో పనులని చెబుతున్నా, ఎమ్మెల్సీ లాబీయింగే అసలు విషయమట.
అటు మాజీ ఎంపీ ఫుల్ యాక్టివ్‌గా మారడంపై, స్థానిక ఎమ్మెల్యేలు మాత్రం రగిలిపోతున్నారట. ముఖ్యంగా బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, నగేష్‌పై మండిపడుతున్నారట. స్థానిక ఎమ్మెల్యేగా వున్న తనను సంప్రదించకుండా, మంత్రుల దృష్టికి నియోజకవర్గ సమస్యలు, పనులు తీసుకెళ్లడమేంటని ఆయన ఫైర్ అవుతున్నారట. అవసరమైతే, పార్టీ పెద్దలకు సైతం కంప్లైంట్ చేసేందుకు రెడీ అవుతున్నారట ఎమ్మెల్యే. మాజీ ఎంపీ నగేష్, ఎమ్మెల్సీ కోసం, తెగ హడావుడి చేస్తుంటే, చాపకింద నీరులా ఆయన ప్రయత్నాలపై నెగెటివ్ ప్రచారం కూడా మొదలైందని, బోథ్ ఎమ్మెల్యే వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోందని కార్యకర్తలంటున్నారు. మొత్తానికి మంత్రిగా, ఎంపీగా, ఇంకా అనేక పదవుల్లో చక్రంతిప్పిన నగేష్, ఎమ్మెల్సీ కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయో రివర్స్ కొడతాయో రానున్న కాలమే చెప్పాలి.