ఎల్లుండి నోటిఫికేషన్ రిలీజ్, 10నుంచి నామినేషన్స్.. పోలింగ్ కేంద్రాల వద్ద టైట్ సెక్యూరిటీ
Telangana Elections 2023: వివాహాలు, శుభకార్యాలపై ఎన్నికల కోడ్ ప్రభావం
Telangana Elections 2023: ఇంకా నెల అంటే నెల రోజులే. సరిగ్గా నెల రోజుల్లో తెలంగాణలో ఓట్ల పండగ జరగబోతోంది. ఎల్లుండి నోటిఫికేషన్ కూడా రిలీజ్ కాబోతోంది. ఆ తర్వాత నామినేషన్ల పర్వం కూడా జోరందుకుంటుంది. ఇప్పటికే పార్టీలు, అభ్యర్థులు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. రోజులు గడుస్తున్న కొద్దీ ఎన్నికలకు టైం దగ్గర పడుతుండడంతో అటు తెలంగాణ పోలీస్ శాఖ కూడా అలర్ట్ అయింది. ఎన్నికల నిర్వహణపై డేగ కన్ను వేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. సజావుగా ఎన్నికల నిర్వహణకు..భారీ బందోబస్త్ ఏర్పాటు చేసింది.
నామినేషన్ కేంద్రాలు, పోలింగ్ కేంద్రాల వద్ద సెక్యూరిటీని టైట్ చేసింది తెలంగాణ పోలీస్ శాఖ. శాంతియుత వాతావరణంలో పోలింగ్ ప్రక్రియ జరిగేలా చర్యలు చేపట్టింది. అనుక్షణం డేగ కళ్లలో ఎన్నికల నిర్వహణను పర్యవేక్షిస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాలపై ఇంకాస్త నిఘా పెంచారు పోలీసులు.
ఈనెల 10 నుంచి నామినేషన్ల పర్వం స్టార్ట్ కానుంది. దీంతో ఆర్వో కార్యాలయాల వద్ద శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసు శాఖ పటిష్ట చర్యలు చేపట్టింది. నామినేషన్ కేంద్రాల వద్ద 4 అంచల భద్రతా వ్యవస్థతతో 144 సెక్షన్ అమలు చేస్తుంది. ఒక్కో నామినేషన్ కేంద్రానికి ఏసీపీ స్థాయి నోడల్ ఆఫీసర్‌ను నియమించింది. రాజకీయ పార్టీల ర్యాలీలు, సమావేశాలకు ఆర్వో అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలనే నిబంధన పెట్టారు.
గ్రేటర్ హైదరాబాద్‌లో 15 నామినేషన్ కేంద్రాలు, రాచకొండలో 8 నియోజకవర్గాలకు నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి నియోజకవర్గానికి 3కు పైగా ఫ్లయింగ్ స్క్వాడ్ విధులు నిర్వహిస్తుంది. ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా.. ఎన్నికల అధికారులు, పోలీసులు నజర్ పెట్టారు. డబ్బు, మద్యం, ఇతర తాయిలాల కట్టడికి అన్ని వ్యవస్థలను అప్రమత్తం చేశారు. సోషల్ మీడియా, ఎన్నికల ప్రచారాలపైనా ఎన్నికల అధికారులు దృష్టి పెట్టారు. అలాగే వివాహాలు, శుభకార్యాలపై ఎన్నికల కోడ్ ప్రభావం ఉండనుంది. మందు తగాలంటే ఎక్సైజ్ శాఖ పెర్మిషన్ తప్పనిసరిగా చేశారు పోలీసులు. ఎలక్షన్స్ తో సంబంధం లేదని బాండ్ పేపర్ రాసివ్వాల్సిందే..!