Telangana Elections: తెలంగాణలో పతాక స్థాయికి చేరుకున్న ఎన్నికల వేడి
Telangana Elections: ప్రత్యర్థుల విమర్శలు, ఆరోపణలను తిప్పికొట్టేందుకు ఈ రూమ్ సిద్ధం
Telangana Elections: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకుంటోంది. ఎన్నికల ప్రచార జోరు పెరుగుతోంది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో.. అన్ని ప్రధాన పార్టీలు జనంలోకి వెళ్లడానికి అవసరమైన వ్యూహాలను రూపొందించుకుంటున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ 30న ఒకే విడతలో పోలింగ్ నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల కమిషన్.... డిసెంబర్ 3న కౌంటింగ్ జరుగుతుంది. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరం ఎన్నికల కౌంటింగ్ కూడా అదే రోజున వెలువడుతుంది. రాజెవరు? బంటు ఎవరు? అనేది తేలిది అప్పుడే.
పోలింగ్‌కు నెలన్నర రోజుల గడువున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ తమ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో తలమునకలై ఉన్నాయి. అధికార బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే జనంలోకి వెళ్లారు. ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. పలు జిల్లాల్లో భారీ ఎత్తున ప్రజా ఆశీర్వాద సభలను నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో బీఆర్ఎస్‌లో కీలక నేతలు హరీష్ రావు, కేటీఆర్, కవిత తదితరులు జనంలోకి వెళ్లి తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై వివరిస్తున్నారు. దీంతోపాటు ప్రతిపక్ష పార్టీల తీరును ఎండగడుతున్నారు.
రానున్న ఎన్నికల్లో విజయం సాధించడానికి అన్ని వనరులను వినియోగించుకుంటోంది బీఆర్ఎస్. సర్వశక్తులను ఒడ్డుతోంది. ఎన్నికల జోరును మరింత పెంచింది బీఆర్ఎస్. రాష్ట్రంలో ఉన్న మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వార్ రూములను ఏర్పాటు చేసింది. గత ఎన్నికల్లో అప్పటి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వార్ రూమ్స్‌ను ఏర్పాటు చేసి సక్సెస్ అయ్యారు. ఈ క్రమంలోనే ఇప్పుడు కూడా వార్ రూమ్స్ ఏర్పాటు చేశారు. ఇందుకోసం 350 మంది ఇంచార్జిలను కొత్తగా నియమించుకుంది బీఆర్ఎస్ అధిష్టానం..
ప్రతి నియోజకవర్గంలో వార్ రూమ్‌ను నెలకొల్పింది. ఆయా నియోజకవర్గాల ఎన్నికల ప్రచార సరళిని పర్యవేక్షించడం, ఎన్నికల మేనిఫెస్టోను ప్రతి ఒక్క ఓటర్‌కూ అర్థమయ్యేలా వివరించడం... ఈ వార్ రూమ్ ముఖ్య ఉద్దేశం. అభ్యర్థి సహా పార్టీ క్యాడర్ మొత్తానికీ దిశానిర్దేశం చేస్తుంది ఈ వార్ రూమ్... అధిష్ఠానం నుంచి అందే సమాచారాన్ని అభ్యర్థితో పాటు పార్టీ కార్యకర్తలకు చేరవేస్తుంది. పార్టీ అగ్ర నాయకత్వానికి... ఓటరుకు మధ్య వారధిలా పనిచేస్తుంది ఈ వార్ రూమ్...
నియోజకవర్గ పరిధిలో కొనసాగుతున్న ప్రచార సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియాకు అందజేస్తుంది ఈ వార్ రూమ్... ఫేస్‌బుక్, ఎక్స్, వాట్సాప్, యూట్యూబ్.. వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్‌ను కూడా ఉపయోగించుకుంటూ... రాజకీయ ప్రత్యర్థులు చేసే విమర్శలు, ఆరోపణలను తిప్పి కొట్టడంతో పాటు పార్టీ క్యాడర్‌ను ఎన్నికల సమరానికి ఈ వార్ రూమ్ సిద్ధం చేయనుంది. ఈ వార్ రూమ్ ఇంఛార్జిలతో బీఆర్ఎస్ అగ్ర నేతలు.. మంత్రులు కేటీఆర్.. టీ హరీష్ రావు సమావేశమయ్యారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లోని జలవిహార్‌లో ఈ సమావేశం ఏర్పాటైంది. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. వార్ రూమ్ ఇంఛార్జిలకు దిశానిర్దేశం చేశారు.