TS PRC: పీఆర్సీకి కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్‌సిగ్నల్
TS PRC: 'నాగార్జునసాగర్' బైపోల్‌పై ప్రభావం పడకుండా.. * ప్రచారం లేకుండా అమలు చేయాలని షరతు
TS PRC: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల పీఆర్సీకి అడ్డంకి తొలగిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీని ప్రకటించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. నాగార్జునసాగర్ ఉపఎన్నిక నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో పీఆర్సీ ప్రకటనకు ఈసీ నుంచి ప్రభుత్వం అనుమతి కోరింది. ఇందుకు వెంటనే స్పందించిన ఈసీ.. పీఆర్సీ ప్రకటించడంపై ఎటువంటి అభ్యంతరం లేదని తెలిపింది. అయితే.. ఉపఎన్నికపై ప్రభావం పడకుండా దీనిని అమలు చేయాలని.. ప్రభుత్వం రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేయరాదని షరతు విధించింది.
ఇదిలా ఉండగా.. ఇవాళ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఉద్యోగుల ఫిట్‌మెంట్‌పై ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఫిటెమెంట్ ఎంత శాతం ప్రకటిస్తారనే విషయంలో ఆసక్తి ఉండగా.. దాదాపు 29శాతం ప్రకటిస్తారని ప్రచారంలో ఉంది. అదేవిధంగా.. ఉద్యోగుల హెల్త్‌కార్డు, పదవీ విరమణ వయసు పెంపు, సీపీఎస్ పెన్షన్ వంటి అంశాల్లో కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే ఇదే విషయంపై ఉద్యోగ సంఘాల నేతలు సీఎం కేసీఆర్‌ను కలుసుకుని ఈ విషయంపై చర్చించినట్లు తెలుస్తోంది.
ఇక ఇప్పటికే ఉద్యోగులకు కేసీఆర్ పలు హామీలను ఇచ్చారు. ఏపీలో ఇస్తున్న ఐఆర్ కన్నా 2శాతం ఎక్కువగా 29శాతం ఫిట్‌మెంట్ ఇస్తామని.. ఉద్యోగ, ఉపాధ్యాయులకు సీజీహెచ్‌ఎస్ లాగే ఈహెచ్‌ఎస్ అమలు చేస్తామని చెప్పారు. అదేవిధంగా సీపీఎస్ ఉద్యోగులకు కుటుంబ పెన్షన్ ఇస్తున్నట్లు ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను రాష్ట్రానికి రప్పించడం వంటి హామీలను ఇచ్చారు. ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులకు పదోన్నతలతోపాటు ఎస్జీటీలకు అన్యాయం జరగకుండా నిర్ణయాలు తీసుకుంటామని ఉద్యోగ సంఘాలలకు కేసీఆర్ హామీలు ఇచ్చారు.