Telangana Election Code: తెలంగాణ వ్యాప్తంగా పోలీసుల తనిఖీలు.. కిలోల కొద్ది బంగారం, భారీగా నగదు సీజ్,
Telangana Election Code: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో రూ.18 లక్షల సీజ్
Telangana Election Code: కుప్పలు కుప్పలుగా డబ్బులు.. కార్లలో లక్షల రూపాయలు.. కిలోల కొద్దీ బంగారం, వెండి.. ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన ఒక్కరోజులోనే దాదాపు 15 కోట్ల దాకా స్వాధీనం చేసుకున్నారు తెలంగాణ పోలీసులు. తొలి రోజే దాదాపు రెండు కోట్ల రూపాయల నగదు, 10 కోట్లకు పైగా విలువ చేసే బంగారం, వెండి పట్టుబడ్డాయి. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ అమల్లోకి రావడంతో తెలంగాణ పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. ఎక్కడికక్కడ వాహనాలను ఆపి అక్రమ నగదు, బంగారం, మద్యం రవాణాపై నిఘా పెంచారు. డబ్బు, మద్యం అక్రమ తరలింపుపై ప్రత్యేక సోదాలు చేస్తున్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 12 లక్షల 50 వేల రూపాయలు సీజ్ చేశారు పోలీసులు. తల్లాడ రింగ్ రోడ్డు సెంటర్‌లో తనిఖీలు చేస్తున్న పోలీసులు.. ఎలాంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న 5 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. వైరాలో మరో 5 లక్షలు.. కొణిజర్ల వాహన తనిఖీల్లో 2 లక్షల 40 వేలు సీజ్ చేశారు. కరీంనగర్ జిల్లా మొగ్దుంపూర్‌లో 3 లక్షలు.. నిజామాబాద్ జిల్లా బోధన్‌లో 5 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. వీటన్నింటికీ ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో సీజ్ చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా తొలిరోజు 18 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు.
ఇక హైదరాబాద్‌లో భారీ ఎత్తున నగదు పట్టుబడింది. నగర వ్యాప్తంగా పోలీసుల విస్తృత సోదాల్లో దాదాపు కోటిన్నర నగదు పట్టుకున్నారు. ఫిలింనగర్‌లో కారులో తరలిస్తున్న 30లక్షలు సీజ్ చేశారు. నిజాంకాలేజ్ దగ్గర భారీగా బంగారాన్ని పట్టుకున్నారు. 16కిలోల బంగారం, 300 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన ఈ బంగారం, వెండి విలువ 10కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. చందానగర్‌లోని తారానగర్‌లో 5 కిలోల 650 గ్రాముల బంగారం సీజ్ చేసి.. ముగ్గురిని అరెస్ట్ చేశారు. హబీబ్‌నగర్ పీఎస్ పరిధిలో 17లక్షలు... పురానాపూల్‌లో బైక్‌పై తరలిస్తుండగా 15లక్షలు.. మలక్‌పేట్‌లో 9 లక్షలు సీజ్ చేశారు. ఇక వనస్థలిపురంలో కారులో తరలిస్తున్న 4 లక్షలు సీజ్ చేశారు పోలీసులు.
చైతన్యపురి పీఎస్ పరిధిలో ఎస్వోటీ పోలీసులు 30 లక్షల నగదును ఆధారాలు లేకుండా తరలిస్తుండగా పట్టుకున్నారు. నగదు తరలిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలో భారీగా నగదు లభ్యమైంది. గాయత్రి ఆస్పత్రి దగ్గర 71 లక్షల 50 వేలు సీజ్ చేశారు SOT పోలీసులు. BDL చౌరస్తాలో 9 లక్షల 38 వేలు స్వాధీనం చేసుకున్నారు.