దుబ్బాక ఉపఎన్నికల్లో నామినేషన్ల పర్వం మొదలయ్యింది. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా సోలిపేట సుజాత నామినేషన్ దాఖలు చేశారు. టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాతకు టిక్కెట్ కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోలిపేట సుజాత మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ తో కలిసి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఈ రోజు నామినేషన్ సమర్పించారు. కాగా నామినేషన్ల స్వీకరణకు ఈ నెల 16వ తేదీ వరకు గడువు ఉండగా 17న పరిశీలన, 19వ తేదీ వరకు ఉపసంహరణకు అవకాశం ఉంది. నవంబర్ 3న దుబ్బాక ఉప ఎన్నిక జరగనుండగా, 10న ఓట్ల లెక్కింపు, విజేతను ప్రకటిస్తారు. ఇక నామినేషన్ ప్రక్రియను ముగిసిన అనంతరం సోలిపేట సుజాత మీడియాతో మాట్లాడుతూ ప్రజలందరికీ అందుబాటులో వారి సమస్యలను తీర్చేందుకు తనను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
అనంతరం మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ దుబ్బాకలో టీఆర్‌ఎస్ భారీ మెజార్టీతో గెలవబోతుందని ధీమా వ్యక్తం చేశారు. హుజూర్‌నగర్ ఫలితాలే దుబ్బాకలో రాబోతున్నాయని జోస్యం చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ అభివృద్ధి నిరోధకులుగా మారారని మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. నిజామాబాద్‌లో కాంగ్రెస్, బీజేపీకి డిపాజిట్ రాలేదని, దుబ్బాకలో కూడా అదే ఫలితాలు వస్తాయన్నారు. అడుగడున అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి ఏ గ్రామానికి వెళ్లిన అపూర్వ స్వాగతం లభిస్తుందని చెప్పారు. బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా రైతు బంధు, రైతు బీమా ఇస్తున్నారా అని ప్రశ్నించారు.
ఇక ఇప్పటికే దుబ్బాకలో ఉప ఎన్నిక ప్రచారం జరిగింది. అన్ని పార్టీల రాష్ట్ర స్థాయి నేతలు దుబ్బాకలో మకాం వేసి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం కొనసాగిస్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నిక కోసం తరలిస్తున్న డబ్బును కూడా పోలీసులు పట్టుకున్నారు. అన్ని పార్టీల మధ్య మాటల యుద్ధం రోజు రోజుకు పెరుగుతోంది. నామినేషన్లు కూడా మొదలవడంతో ప్రలోభాలకు సైతం తెరలేచింది.