హైదరాబాద్‌లో గంజాయ్‌ మాఫియా.. యూత్‌ టార్గెట్‌గా నోరు తెరిచిన మాఫియా..

Update: 2020-06-06 03:19 GMT

ఒక్కసారి సారి రుచి చూస్తే చాలు జీవితాంతం దానికి బానిస అవ్వాల్సిందే. ముందు ఊహాలోకంలో విహరింపజేస్తుంది ఆ తర్వాత జీవితాన్ని నాశనం చేస్తుంది కొకైన్  హెరాయిన్ పేరు ఏదైనా కావచ్చు మనిషిని బానిస చేసుకోవటంలో అన్నీ ఒక్కటే. కాస్ట్‌లీ కల్చర్ పేరుతో దేశానికి పట్టిన జాడ్యం ఇప్పుడు అందరినీ పట్టుకుంటోంది. ఒకప్పుడు మెట్రో నగరాలకే పరిమితం అయిన డ్రగ్స్ కల్చర్ ఇప్పుడు దేశమంతటికి పాకుతోంది. యువతను పట్టి పీడిస్తోంది. హైదరాబాద్‌లో తాజాగా పడగ విప్పిన గంజాయ్‌ మాఫియా ఉదంతం ఇదే ఉదాహరణగా చూపెడుతోంది.

హైద‌రాబాద్‌లో గంజాయి మాఫియా మరోసారి పడగ విప్పుతోంది. ఇక్కడి మార్కెట్‌పై డ్రగ్స్ ముఠాలు కన్నేశాయ్‌. ఎన్నిసార్లు ఎంత మందిని అరెస్ట్ చేసినా భాగ్యనగరానికి అంటుకున్న డ్రగ్స్ మత్తు వదలడం లేదు. గంజాయి మాఫియాకు ఎత్తుకు పైఎత్తులు వేస్తూ అధికారుల క‌ళ్లుగ‌ప్పి అక్రమంగా స్మగ్లింగ్‌కు తెర‌ లేపుతున్నారు. సినీ ఫ‌క్కీ త‌ర‌హాలో ప్లాన్ వేస్తూ విఫ‌ల‌య‌త్నమై ప‌ట్టుబడుతున్నారు.

ఇనుప కండలు ఉక్కు నరాలు ఇలాంటి యువత దేశానికి కావాలన్నారు దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందన్నారు స్వామి వివేకానంద. కానీ నేటి యువతరం పెడమార్గంలో పోతోంది. మాదక ద్రవ్యాల మత్తులో జోగుతోంది. సంస్కృతి పేరుతో పుట్టుకొచ్చిన కొత్త కల్చర్ వీరి జీవితాన్ని భ్రష్టు పట్టిస్తోంది. పబ్ కల్చర్‌తో ఊగిపోతున్న యూత్ డ్రగ్స్ మత్తులో పడి జీవితాన్ని కోల్పోతున్నారు అమెరికా యూరోప్ ఆఫ్రికా దేశాల నుంచి వచ్చిన కొందరు మన దేశంలోని హైఫై సొసైటీకి డ్రగ్స్ రుచి చూపించి మన యూత్‌ను మత్తుకు బానిసలుగా మారుస్తున్నారు.

వెస్ట్రన్ కల్చర్ మోజులో పడ్డ కొందరు యువత దీని వ్యామోహంలో పడ్డారు. వీరిని అనుకూలంగా మార్చుకున్న డ్రగ్స్ వ్యాపారులు తెలివిగా డ్రగ్స్ రొంపిలోకి దింపుతున్నారు. హైఫై సొసైటీ పార్టీల్లో డ్రగ్స్ వాడకం ఓ భాగం చేశారు. డబ్బు కొద్దీ వెరైటీ అంటూ కొత్తకొత్త రకాల్ని ఎరవేసి మత్తులోకంలో ముంచేశారు. మొదట్లో కొద్ది మందికి మాత్రమే ఈ అలవాటు ఉండేది. కానీ డ్రగ్స్ వ్యాపరంలోకి మాఫియా ఎంటర్ అయ్యాక మాదక ద్రవ్యాల వాడకం జోరందుకుంది. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ నుంచి భారీగా డ్రగ్స్, మన దేశంలోకి రవాణా అవుతున్నాయి. వీటిని అరికట్టేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా రవాణా ఆగడం లేదు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి కొచ్చిన్‌ తీరానికి, పాకిస్తాన్ నుంచి ముంబై రేవుకు డ్రగ్స్ వస్తున్నాయి. ముఖ్యంగా మన దేశంలో కొకైన్, హెరాయిన్, గోల్డ్ డస్ట్, హేషిష్, కిల్లర్, వైట్ మ్యాజిక్, లేడీస్ ఇలాంటి పేర్లతో రకరకాల డ్రగ్స్ వాడుతున్నారు. వీటి క్వాలిటీని బట్టి రేటు ఉంటుంది. గ్రామ వంద రూపాయిల నుంచి దాదాపు ఐదువేల దాకా అమ్ముడవుతుంది.

హైదరాబాద్‌లో డ్రగ్స్ మాఫియా అంతకంతకూ విస్తరిస్తుండటం ఆందోళనకరం. నైజీరియన్, ఉగాండా, టాంజానియా దేశానికి చెందిన వారు చదువుకోవడానికి వీసా ద్వారా వచ్చి హైదరాబాద్‌లోనే మకాం వేస్తున్నారు. వారి అవసరాలకు డబ్బులు లేక వాళ్ళ దేశం నుంచి సముద్రం మార్గం ద్వారా ముంబైకి, బెంగళూరుకి డ్రగ్స్ తెప్పించి ఇక్కడ అమ్ముతున్నారు. ముఖ్యంగా డ్రగ్స్ చైన్నె, తమిళనాడు విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్‌లో సరఫరా ఎక్కువగా చేస్తున్నారు. వీరికి ప్రతి చోట డీలర్స్‌ ఉంటారు. వారికి డైరక్ట్‌గా కొకైన్‌ సరఫరా చేసి అవసరాలకు డబ్బులు సంపాదించుకుంటారు.

ఏమైనా హైదరాబాద్‌ సిటీ కేంద్రంగా కోట్లాది రూపాయల డ్రగ్స్‌, దేశదేశాలకు రవాణా అవుతోంది. ప్రతిసారి డ్రగ్స్‌ తరలిస్తున్న ముఠాను పట్టుకోవడం, మత్తు పదార్థాలను సీజ్‌ చేయడం చాలా కామన్‌గా జరిగిపోయేది. పట్టుకున్న ప్రతిసారి అలా వదలేయడం కాకుండా కఠినమైన చట్టాలు తెచ్చి డగ్స్‌ మాఫియాకు ముచ్చెమటలు పట్టించాల్సిన అవసరాన్ని పోలీసులు గుర్తించాలి.

బెంగళూర్ నుంచి హైదరాబాద్‌కు కొత్త కొత్త పద్దతులతో అక్రమ రవాణా జరుగుతోంది. డ్రగ్స్, గంజాయి మత్తు పదార్థం ఏదైనా వివిధ రూపాల్లో హైదరాబాద్‌కి తరలించడం కామన్‌ అయిపోయింది. విద్యార్థులకో, యువతకో, పబ్బలకో, క్లబ్బులకో సరఫరా చేస్తున్నారు కంత్రీగాళ్లు. పోలీసులు ఎంత పకడ్బందీగా ఉంటున్నా... వాళ్ల కళ్లుగప్పి... ఎత్తులకు పైఎత్తులు వేస్తూ తప్పించుకుంటున్నారు. కారు డోర్లు, బెనేట్లలో గంజాయిని స్మగ్లింగ్ చేస్తుంటే, ఇక డ్రగ్స్‌ను సిగరెట్ ప్యాకెట్‌లలో అమర్చి అక్రమంగా తరలిస్తున్నారు.

లాక్‌డౌన్‌ ఉన్న దాదాపు రెండు నెలలు డ్రగ్స్ సరఫరా ఎక్కడ జరగలేదు. కానీ లాక్‌డౌన్ కొద్దిగా సడలించగానే డ్రగ్స్ ముఠాలు, మత్తు మాఫియా యాక్టివ్ అయిపోయింది. మొన్నీ మధ్య బెంగళూర్ నుంచి హైదరాబాద్‌కి సినీ ఫక్కీలో తరలిస్తూ పట్టుబడ్డ డ్రగ్స్ ముఠా నుంచి పోలీసులు కీలక సమాచారం రాబట్టారు. N- 95 మాస్క్‌లు కొనుగోలు, అమ్మకాలు పేరుతో వెళ్లి డ్రగ్స్‌ను కొనుగోలు చేసి హైదరాబాద్‌కి తరలిస్తుండగా అమిత్‌సింగ్, పరంజ్యోతి అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు రెడ్్హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితులు నుంచి 700 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఇద్దరు నిందితుల నుంచే అధికారులు కీలక సమాచారాన్ని రాబట్టారు. బెంగళూర్‌లో ఉన్న మైక్ అనే నైజీరియన్ వద్ద కొనుగోలు చేసినట్లు గుర్తించారు. దానికి ముందే నిందితులు అలర్ట్‌ అయ్యారు. వాట్సప్‌లో చేసిన చాటింగ్ మొత్తం డిలేట్ చేశారు. దీంతో టెక్నీకల్ ఎక్స్‌పర్ట్‌తో వాట్సప్, కాల్ లిస్ట్ రీట్రై చేస్తున్నారు అధికారులు. అలాగే గతంలో మైక్ అనే వ్యక్తి డ్రగ్స్ కేసులోనే అరెస్ట్ అయ్యాడు. దీంతో అతని కోసం టాస్క్‌ఫోర్స్ టీమ్ గాలింపు చర్యలు చేపట్టింది.

డ్రగ్స్... హైదరాబాద్‌నే కాదు తెలుగు రాష్ట్రాలను పట్టిపీడిస్తున్న మహమ్మారి. దీని బారినపడి ఎన్నో జీవితాలు నాశనమయ్యాయి. మరెన్నో కుటుంబాలు, ఇంకెందరో వ్యక్తుల జీవితాలు ఛిన్నాభిన్నమయ్యాయి. ఒకప్పుడు పాశ్చాత్య దేశాలకు అభివృద్ది చెందిన దేశాలకే పరిమితమైన ఈ వ్యసనం, ఇప్పుడు చాపకింద నీరులా విస్తరించింది. డ్రగ్స్ తీసుకోవడం ఫ్యాషన్‌గా భావించి కొందరు, డ్రగ్స్‌కు బానిసలవుతుంటే మరికొందరు బలవంతంగా ఈ వ్యసనం ఊబిలో చిక్కుకుంటున్నారు.

ఇదే అదనుగా డ్రగ్స్‌ మాఫియా కూడా రూటు మార్చింది. సంపన్నవర్గాలు, ఎగువ మధ్యతరగతి ప్రజలలను లక్ష్యంగా చేసుకొని లక్షల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తోంది. ఒక్కసారి డ్రగ్ మత్తులో పడ్డామా ఇక అంతే జీవితాంతం దానికి బానిసకావాల్సిందే. సంతోషమైనా బాధలో ఉన్నా, .డ్రగ్స్ తీసుకున్నామా... గమ్మత్తులోకాల్లోకి షికారు చేయిస్తుంది. ఆకాశంలో తేలాడినట్లు అనుభూతిని కలిగిస్తుంది. ఏదో కొత్త శక్తిని పొందామన్న భ్రమను కలిగిస్తుంది. అందుకే చాలా మంది యువత ముఖ‌్యంగా స్పోర్ట్స్ మెన్ , సినీ స్టార్స్ డ్రగ్స్ కు బానిసలుగా మారుతున్నారు.

డ్రగ్స్ నియంత్రణకు ఉన్న చట్టాలు చాలా పటిష్టమైనవే అయినప్పటికీ..హైదరాబాద్‌లో వీటిని నియంత్రించే శాఖలు సమన్వయంతో పని చేయడం లేదన్న విమర్శలున్నాయి. నార్కోటిక్ సెల్, డ్రగ్ కంట్రోల్ బోర్డ్, డీఆర్‌ఐ, సీఐడీలోని యాంటీ నార్కోటిక్ సెల్, ఎక్సైజ్ శాఖలు, దేని దారి దానిదే. పటిష్టమైన నిఘా యంత్రాంగం లేకపోవడంతో డ్రగ్ ముఠాలు రెచ్చిపోతున్నాయన్న ఆరోపణలున్నాయ్‌. ఇతర రాష్ట్రాలతో సమాచారం ఇచ్చిపుచ్చుకుని దర్యాప్తును వేగవంతం చేయడంలో ఈ శాఖలు తరచుగా విఫలం అవుతున్నాయన్న విమర్శలున్నాయి. ఫలితంగా నగరంలో డ్రగ్స్ వ్యాపారం చాపకింద నీరులా విస్తరిస్తూనే ఉందంటున్నారు రాజధానివాసులు.

చూశారు కదా. పబ్బులు, క్లబ్బులు, హుక్కాసెంటర్లు, యువతకు డ్రగ్‌ సరఫరా చేసే కేంద్రాలవుతున్నాయి. వీటిపై ఎవరి ప్రభావాలకూ లోనుకాకుండా ఉక్కుపాదం మోపాలి. నిందితులు ఎంతటివారైనా కఠిన చర్యలు తీసుకోవాలి. యూత్‌కు కౌన్సెలింగ్‌ ఇవ్వాలి. ఇలా ఎన్నో చర్యలు పకడ్బందీగా అమలు చేస్తేనే కానీ, హైదరాబాద్‌ డ్రగ్‌ ఫ్రీ సిటీగా అవతరించదని సామాజికవేత్తలంటున్నారు. 

Tags:    

Similar News