AIMIM Party: మజ్లిస్ పార్టీకి మేనిఫెస్టో ఉండదా..?
AIMIM Party: ప్రజలకు అందుబాటులో ఉన్నప్పుడు.. మేనిఫెస్టో ఎందుకంటున్న ఓవైసీ
AIMIM Party: ఎన్నికల్లో మేనిఫెస్టోల పాత్ర చాలా కీలకం. అధికారంలోకి వస్తే ఏం ఏం చేస్తామో మేనిఫెస్టో రూపంలో ప్రజలకు హామీలు ఇస్తుంటాయి పార్టీలు. గెలిస్తే అది చేస్తాం, ఇది చేస్తామంటూ ఆకర్షనీయంగా పథకాలు ప్రకటిస్తుంటాయి. ఒక్కో సారి మేనిఫెస్టోలే పార్టీల గెలుపులో కీలకంగా మారుతాయి. కానీ ఎంఐఎం పార్టీ మాత్రం అసలు మేనిఫెస్టోనే అవసరం లేదు అంటోంది. ఇప్పటి వరకు ఎన్నో సార్లు ఎన్నికల్లో పోటీ చేసినా.. ఒక్కసారిగా కూడా మజ్లిస్ పార్టీ మేనిఫెస్టోలను విడుదల చేయలేదు.
ఎంఐఎం పార్టీ మేనిఫెస్టో ప్రకటించకపోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు మజ్లిస్ ఎందుకు మేనిఫెస్టో రిలీజ్ చేయదు. అన్ని పార్టీలు మేనిఫెస్టోను ప్రకటిస్తున్నప్పుడు ఒక్క మజ్లిస్‌కు ఉన్న ఇబ్బంది ఏంటి అనే డౌట్స్ ఉత్పన్నం అవుతున్నాయి. ఎంఐఎం రాజకీయ పార్టీ కాదా..? అన్ని పార్టీలకు దానికేమన్న డిఫరెంట్స్ ఉన్నాయా అనే అనుమానాలు కలుగుతున్నాయి. పేరుకు ఎంఐఎం ప్రాంతీయ పార్టీ అయినా దేశవ్యాప్తంగా పోటీ చేస్తుంటుంది. ముస్లింలకు ఎంఐఎం ప్రాతినిథ్యంగా చెప్పుకుంటారు ఆ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ.
అలాంటప్పుడు ముస్లింలకు సంక్షేమ ఫలాలు అవసరం లేదా..? భవిష్యత్తుపై భరోసా కోసం సంక్షేమ, అభివృద్ధిపై ప్రణాళిక అవసరం లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. హామీలు ఇచ్చి చేయకపోతే ప్రజలు నిలదీస్తారనే మేనిఫెస్టో జోలికి వెళ్లడం లేదా అని పొలిటికల్ విశ్లేషకుల అభిప్రాయం. ఐతే మజ్లిస్ పార్టీ.. మేనిఫెస్టో ఇవ్వకపోయినా గత కొన్నేళ్లుగా పాతబస్తీలో కంచుకోటలా మారింది.
మేనిఫెస్టోపై మిగతా పార్టీల అభిప్రాయం ఒకలా ఉంటే.. అసదుద్దీన్ ఓవైసీ మాత్రం మరోలా వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజల్ని మభ్యపెట్టేందుకే ఇతర పార్టీలు మేనిఫెస్టోలను ప్రకటిస్తున్నాయని ఓవైసీ అభిప్రాయపడ్డారు. తాము హామీలు ఇవ్వమని, పని చేసి గుర్తింపు సాధిస్తామంటున్నారు మజ్లిస్ చీఫ్. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్నప్పుడు.. ఇక మేనిఫెస్టోలు ఎందుకంటున్నారు ఓవైసీ. ఈసారి బలమైన స్థానాల్లో పోటీ చేస్తామంటున్న మజ్లిస్..ప్రజలకు ఎలాంటి సంక్షేమ, అభివృద్ధి హామీలు ఇవ్వకుండా.. ఎలా ఓటర్లను ఆకర్షిస్తుంది అనేది ఆసక్తిగా మారింది.