TS RTC: ఆర్టీసీకి పెనుభారంగా మారిన డీజిల్ ధరలు
TS RTC: ధరల వ్యత్యాసాలతో బస్ డిపోల్లో డీజిల్ నిల్వలకు వెనకడుగు
TS RTC: కరోనతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఆర్టీసీకి డీజిల్ ధరలు పెనుభారంగా మారాయి. ధరల వ్యత్యాసాలతో బస్ డీపోల్లో డీజిల్ నిల్వ చేసుకోవడానికి ఆర్టీసీ వెనకడుగు వేస్తోంది. కొన్ని ప్రాంతాల్లో బస్సు సర్వీసులను సైతం నిలిపివేయాల్సిన పరిస్థితి నెలకొంది. సకాలంలో చెల్లింపులు చేయకపోవటంతో చమురు సంస్థలు సరఫరాను నియంత్రిస్తున్నాయి. ఒకపక్క కరోనా కష్టాలు.. మరోవైపు డీజిల్ ధరలతో ఆర్టీసీ కుదేలవుతోంది.
డీజిల్ ధరల పెరుగుదలతో సామాన్య ప్రజల ఇబ్బందుల మాటెలా ఉన్నా.. ఆర్టీసీకి మాత్రం గుదిబండగా మారుతోంది. పెరుగుతున్న డీజిల్ రేట్ల కారణంగా సంస్థపై అదనపు భారం పడుతోంది. ప్రయాణికుల సంఖ్య ఇప్పుడిప్పుడే పుంజుకుంటుండగా ఇంధన సరఫరాలో ఇబ్బందులు ఆదాయాన్ని దెబ్బతీస్తున్నాయి. మహబూబ్‌నగర్, ఖమ్మం రీజియన్‌లలో ఈ పరిస్థితి తలెత్తింది. దీంతో కొన్ని సర్వీసులను నిలిపివేశారు. డీజిల్ కోసం ఆర్టీసీ ఏటా 700 కోట్లు వెచ్చిస్తోంది. కరోనా వల్ల ఆదాయంలేకపోవడంతో ప్రతి నెలా ప్రభుత్వం వైపు చూడాల్సిన పరిస్థితి. ఉద్యోగులకు జీతాలు కూడా 10 రోజులు ఆలస్యంగా చెల్లిస్తుంది.
ఇంధన ధరల్లో హెచ్చు తగ్గులు అధికంగా ఉంటూ ఉండటంతో నిల్వలను ఆర్టీసీ తగ్గించుకుంటోంది. సాధారణంగా ప్రతి డిపో లేదా రీజియన్ పరిధిలో పది నుంచి పదిహేను రోజులకు సరిపడే నిల్వలు ఉండేవి. చెల్లింపుల్లో జాప్యం జరిగినా బస్సులు ఆగేవి కాదు. అయితే ధరల్లో నిలకడ లేక ఎక్కువ రోజులకు సరిపడా నిల్వలు నిర్వహించేందుకు అధికారులు వెనకడుగు వేస్తున్నారు. ఇవన్నీ కలిసి ఆదాయంపై ప్రభావాన్ని చూపటంతో బకాయిలు చెల్లించేందుకు ఆర్టీసీ అవస్థలు పడుతోంది.
చమురు సంస్థలు నేరుగా డిపోలకు డీజిల్‌ను సరఫరా చేస్తాయి. బహిరంగ మార్కెట్‌లో ఉన్న ధర కన్నా తక్కువకు పంపిణీ చేస్తాయి. చెల్లింపు విధానాన్ని రెండేళ్ల క్రితం వికేంద్రీకరించారు. గతంలో కేంద్ర కార్యాలయం నుంచే జరిగేది. ఇప్పుడు ఏ రీజియన్‌కు ఆ రీజియనే చెల్లించాలి. దీంతో డీజిల్ పై హెచ్చుతగ్గులు ఏర్పడుతున్నాయి. దీనిపై ఆర్టీసీ యాజమాన్యం దృష్టి సారించిల్సిన అవసరం ఉంది.