తెలంగాణలో ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు ఇవాళ్టి నుంచి జరగనున్నాయి. హైదరాబాద్‌లో మినహా రాష్ట్రవ్యాప్తంగా అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో ధరణి పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. అన్ని చోట్లా కంప్యూటర్లు, స్కానర్లు, ప్రింటర్లు, బయోమెట్రిక్ పరికరాలు, వెబ్ కెమెరాలు అమర్చారు. అన్ని కార్యాలయాలకూ ప్రభుత్వ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్‌నెట్ కనెక్షన్ ఇచ్చారు.
శనివారం సాయంత్రం నుంచే రాష్ట్రవ్యాప్తంగా స్లాట్ బుకింగ్‌లు చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. నేరుగా లేదా మీసేవ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవడానికి వెసులుబాటు కల్పించింది. మీసేవ కేంద్రాల్లో స్లాట్ బుకింగ్‌కు ఒక్కో స్లాట్‌కూ 2 వందల రూపాయల చొప్పున యూజర్ చార్జీగా నిర్ధారిస్తూ జీవో జారీ చేశారు. మీసేవలో స్లాట్ బుక్ చేసుకుంటే 10 పేజీల ప్రింటవుట్‌ను ఉచితంగా తీసుకోవచ్చు. ఆ తర్వాత తీసుకునే ప్రతి ప్రింటవుట్‌కూ రూ.5 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.