తెలంగాణ చరిత్రను మలుపు తిప్పిన రోజు.. డిసెంబర్ 09 ప్రకటనకు 11ఏళ్లు!
చిదంబరం ప్రకటనతో కేసీఆర్ ఆమరణ నిరాహర దీక్ష విరమించారు. విద్యార్థులు ముట్టడి విరమించుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా సంబురాలు చేసుకున్నారు. కానీ, అది ఎక్కువ రోజులు నిలువలేదు
తెలంగాణ చరిత్రలో మైలురాయిగా నిలిచింది డిసెంబర్ 09. తెలంగాణ అస్థిత్వానికి గుర్తింపు లభించిన రోజు. తెలంగాణ ప్రజల ఉద్యమానికి కేంద్రం తలవంచిన రోజు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి బీజం పడిన రోజు. మలిదశ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడిన సమయంలో.. రాష్ట్ర ఏర్పాటుకు ప్రక్రియ ప్రారంభింస్తున్నామని అప్పటి హోం మంత్రిగా ఉన్న చిదంబరం ప్రకటించారు. అంతకుముందు 2009 నవంబర్ 29న చేపట్టిన కేసీఆర్ దీక్షా 11వ రోజుకు చేరడం.. డిసెంబర్ 10న ఉస్మానియా విద్యార్థి జేఏసీ ఛలో అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడంతో.. యూపీఏ సర్కార్‌కు చలనం మొదలైంది. దాంతో డిసెంబర్ 9న అర్ధరాత్రి సమయంలో చిదంబరం ప్రకటించారు.
తెలంగాణ తెచ్చుడో.. కేసీఆర్ చచ్చుడో అనే ఒకే ఒక నినాదంతో ఉద్యమం సాగించారు. ఇటు నిమ్స్ ఆస్పత్రిలో కేసీఆర్ దీక్ష 11వ రోజుకు చేరింది. కేసీఆర్ ఆరోగ్యం ఆందోళన కలిగింది. మరోవైపు ఉద్యమం విద్యార్థుల చేతులోకి వెళ్లడంతో యూపీఏ సర్కార్ పునాదులు కదిలాయి.. దాంతో కేంద్రం దిగి వచ్చింది. కాంగ్రెస్ వార్ రూంలో సుదీర్ఘంగా చర్చించి.. రాష్ట్ర ప్రకటనను చిదంబరం ప్రకటించారు. నవంబర్ 29 తర్వాత పెట్టిన కేసులన్నీంటిని కొట్టివేయాలని అప్పటి ఏపీ సీఎంను హోం మంత్రి చిదంబరం కోరారు.
చిదంబరం ప్రకటనతో కేసీఆర్ ఆమరణ నిరాహర దీక్ష విరమించారు. విద్యార్థులు ముట్టడి విరమించుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా సంబురాలు చేసుకున్నారు. కానీ, అది ఎక్కువ రోజులు నిలువలేదు. ఆ తర్వాత కోస్తాంధ్ర నాయకుల ఒత్తిళ్లకు కేంద్రం తలొగ్గింది. ఆంధ్ర నాయకులు ధర్నాలు, రాస్తారోకోలు, రాజీనామాలతో కేంద్రం దిగి వచ్చింది. డిసెంబర్ 09 ప్రకటనను తిరిగి యూపీఏ సర్కార్ విరమించుకుంది. తెలంగాణ భగ్గుమంది. ఐదేళ్ల పాటు సుదీర్ఘంగా సాగిన ఉద్యమ ఫలితం.. 2014 జూన్ 2న దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడింది.