Gandhi Hospital Mortuary: గాంధీ ఆసుపత్రిలో పేరుకుపోయిన మృత దేహాలు
Gandhi Hospital Mortuary: గాంధీ ఆసుపత్రిలో 300 మృత దేహాలు పేరుకుపోయాయి.
Gandhi Hospital Mortuary: దేశ వ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేస్తోంది. ప్రభుత్వ అధికారులు మాత్రం కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నట్లు చెప్తున్నాయి. వాస్తవ పరిస్థితి దానికి భిన్నంగా కనపడుతోంది. గాంధీ ఆసుపత్రిలో కరోనా మృతదేహాలు పేరుకుపోతున్నాయి. సకాలంలో అంత్యక్రియలు పూర్తి కావడంలేదు. అశాస్త్రీయ విధానాలు, అధికారుల నిర్లక్ష్యం, బంధువుల భయాందోళనల కారణంగా మృతుల ఆత్మలు ఘోషిస్తున్నాయి. రోజుల తరబడి పేరుకుపోవడంతో తీవ్ర దుర్గంధం వస్తోందని మార్చరీ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్, ఇతర దీర్ఘకాల జబ్బుల కారణంగా రోజూ గాంధీలో 40-50 మంది వరకు మృత్యువాత పడుతున్నారు. వాటిలో సగం మాత్రమే అదే రోజు బయటకు వెళ్తున్నాయి. మిగిలిన వాటిని మార్చురీలో వదిలేస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు ఇక్కడ 300 మృతదేహాలు పేరుకుపోయాయి.
శవాలు ఇలా పేరుకుపోవడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నగరంలో 800కు పైగా శ్మశానాలు ఉంటే నాలుగింటికే పంపిస్తుండడం, మృతదేహాల అప్పగింతలో నిర్లక్ష్యం వంటి కారణంగానే ఈ పరిస్థితులు తలెత్తినట్టు చెబుతున్నారు. దీనికితోడు నగరంలోని శ్శశాన వాటికలో దహనం చేయాలంటే రూ. 25 వేలు, స్వగ్రామాలకు తరలించి అంత్యక్రియలు చేయాలంటే దాదాపు 50 వేలకు పైగా ఖర్చవుతోంది. దీంతో అంత ఖర్చు భరించలేని వారు వాటిని మార్చురీలోనే వదిలేస్తున్నారు. కాబట్టి మృతదేహాల అప్పగింతకు సంబంధించిన నిబంధనలు సరళతరం చేయాలని పలువురు కోరుతున్నారు. అలాగే, కొవిడ్ మృతుల దహనాల కోసం మరిన్ని శ్మశానాలను అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు.