Dalita Bandhu: ఈ నెల 16 నుంచి హుజూరాబాద్‌లో దళిత బంధు

Dalita Bandhu: పాడి కౌశిక్‌రెడ్డికి గవర్నర్‌కోటాలో ఎమ్మెల్సీ పదవికి సిఫరసు * 57 ఏళ్లకు పెన్షన్ ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశం

Update: 2021-08-02 02:02 GMT
ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్న దళిత బంధు (ఫైల్ ఇమేజ్)

Dalita Bandhu: హుజూరాబాద్‌ ఎన్నిక వేళ తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయాలు తీసుకుంది. వృద్ధాప్య పింఛన్‌ వయస్సును తగ్గించింది. 50వేల లోపు రుణమాఫి చేయాలని నిర్ణయించింది. దళిత బంధుకు అమోదం తెలిపింది. హుజూరాబాద్‌ ప్రాంత నేతను ఎమ్మెల్సీగా నియమించాలని గవర్నర్‌కు సిఫారస్‌ పంపింది. మొత్తానికి హుజూరాబాద్‌ బైఎలక్షన్‌ వేళ తెలంగాణ కేబినెట్‌ ప్రజలకు వరాల జల్లు కురుపించింది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకం అమలు, విధి విధానాలపై మంత్రివర్గం చర్చించింది. ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా ఈనెల 16 నుంచి హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ప్రారంభించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. పూర్తి స్థాయిలో అధికారులు సిద్ధంగా ఉండాలని సీఎం ఆదేశించారు.

ఇక వ్యవసాయ రంగంపై చర్చించిన కేబినెట్ పత్తి సాగు పెంచేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇక ఆర్థిక శాఖ పంట రుణాల వివరాలను సమర్పించగా.. ఈనెల 15 నుంచి నెలాఖరు వరకు 50 వేల వరకు రుణాలను మాఫీ చేయాలని నిర్ణయం తీసుకుంది కేబినెట్.

ఇటీవలే గులాబీ కండువా కప్పుకున్న పాడి కౌశిక్ రెడ్డి బంపారాఫర్ కొట్టేశారు. కౌశిక్ రెడ్డిని నామినేటెడ్ కోటాలో ఎమ్మెల్సీగా నియమించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. గవర్నర్ ఆమోదంకోసం కేబినెట్ సిఫారసు చేసింది. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా కౌశిక్ రెడ్డిని పదవి వరించినట్టు కనిపిస్తోంది.

రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, ఆక్సిజన్ నిల్వలు, వ్యాక్సినేషన్, వ్యవసాయం, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై మంత్రివర్గం చర్చించింది. కేంద్రం ప్రవేశపెట్టిన ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కోటా రిజర్వేషన్లకు ఆమోదం తెలిపింది. మరోవైపు వృద్ధాప్య పింఛన్ల అర్హత వయస్సును 57ఏళ్లకు తగ్గించింది. దీంతో రాష్ట్రంలో మరో 6.62 లక్షల మందికి కొత్తగా పింఛన్లు ఇవ్వాల్సి ఉంటుంది.

కొవిడ్‌ కారణంగా అనాథలైన పిల్లల పూర్తి వివరాలను అన్ని జిల్లాల కలెక్టర్ల నుంచి తెప్పించాలని వైద్యశాఖ కార్యదర్శిని కేబినెట్‌ ఆదేశించింది. రాష్ట్రంలో అనాథలు, అనాథ శరణాలయాల స్థితిగతులు, సమస్యలు, అవగాహన విధానం రూపకల్పన కోసం మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్‌ అధ్యక్షతన కేబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Tags:    

Similar News